Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రౌండ్లోకి ప్రత్యేక టీంలు
- అన్నీతానై నడిపిస్తున్న క్యాబినెట్ మంత్రి..?
- మాయమాటలతో పేద రైతులకు ఎర
- అసైన్డ్ భూములు పట్టాలు కావంటూ బెదిరింపులు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
'ఓ మంత్రి పంపిస్తే మేము మీ దగ్గరికి వచ్చాం. అసైన్డ్ భూములు ఉంటే చెప్పండి. మేము కొనుగోలు చేస్తాం. ఆ భూములకు ఎప్పటికీ పట్టాలు రావు. ప్రభుత్వానికి అవసరం ఉంటే లాక్కొంటుంది. ఉత్తగా ప్రభుత్వానికి ఇచ్చే కంటే మాకు ఇచ్చేయండి. మీకు గిట్టుబాటు అయ్యే విధంగానే డబ్బులు ఇస్తాం. తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. ప్రభుత్వంతో మాకు మంచి సంబంధాలున్నాయి. ఏం అయినా అన్నీ మేమే చూసుకుంటాం.' అని రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక టీంలు గ్రామాల్లో తిరుగుతున్నాయి. రైతులకు మాయమాటలు చెప్పి మభ్యపెడుతున్నాయి. ఈ వ్యవహారం అంతా ఓ మంత్రి కన్నుసన్నల్లోనే నడుస్తోంది. ఆయననే ప్రత్యేక టీంలను గ్రామాల్లోకి పంపించి భూములను కొనుగోలు చేపిస్తున్నట్టు ఆ టీం సభ్యులు రైతులతో మాట్లాడిన మాటలు వింటే అర్థం అవుతోంది. తక్కువ ధరకు అసైన్డ్ భూములు తీసుకుని, వాటిని రూ.కోట్లలో అమ్ముకునేందుకు ఆ మంత్రి వ్యూహం రచించినట్టు సమాచారం. గతంలో ఫార్మాసిటీ భూముల వ్యవహారంలోనూ ఆ మంత్రి ఇదే తరహా వ్యూహాన్ని అనుసరించారని తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లాలో ఉన్న వ్యవసాయ భూముల్లో 30 శాతం భూములు భూ పోరాటాల ఫలితంగా నాటి ప్రభుత్వాలు పేదలకు అసైన్ చేసినవే. 1960 భూ పోరాటంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో 52,315 మందికిగాను 82,336 ఎకరాలు భూ పంపిణీ చేశారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, కందుకూరు ప్రాంతాల్లో ఎక్కువగా పంపిణీ చేశారు. ఈ భూములు నేటికీ రైతుల పేర పట్టాలు కాలేదు. అయితే రంగారెడ్డి జిల్లాలో ఎలాంటి భూమైనా ఎకరం రూ.50 లక్షల నుంచి రూ. కోటి పలుకుతోంది. ఈ భూములను కాజేసేందుకు అధికార పార్టీ నాయకులు కుట్రలు పన్నుతున్నారు. రైతులకు నయానో భయానో అప్పజెప్పి, ఆ భూముల ద్వారా కోట్లు గడించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
కాపాడాల్సిన వారే కాజేస్తున్నారు..
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ మండలం గుర్రంగూడ గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 92లో ఉన్న 250 ఎకరాల అసైన్డ్ భూమిలో సుమారు 350 మంది ఉన్నారు. వీరికి ఇప్పటికీ పట్టాలు రాలేదు. పట్టాల కోసం రైతులు ఏండ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. ఈ భూములపై సర్కార్ పెద్దల కన్ను పడింది. వీటిని కాజేయడానికి క్యాబినెట్‌లోని ఓ మంత్రి కొత్త విధానానికి తెర లేపారు. రైతుల వద్దకు తమ ప్రత్యేక టీంలను పంపించారు. మీరు మాకు భూములిస్తే ఎకరానికి రూ.10లక్షలు ఇస్తామంటూ మాయమాటలతో రైతులను ఆ టీంలు మభ్యపెడుతూ భూములను కాజేసే కుట్రలు చేస్తున్నారు. వినని చోట బెదిరింపులకు కూడా పాల్పడుతున్నట్టు సమాచారం. అలాగే ఇబ్రహీంపట్నం పటేల్‌గూడలో సర్వే నెంబర్ 710లోని 83 ఎకరాలకు (ఈ భూమిని తెలంగాణ సాయుధ పోరాట సమయంలో కమ్యూనిస్టులు పేదలకు పంపిణీ చేశారు) ఎకరం రూ. 5లక్షల చొప్పున బేరం చేసి రైతులకు టోకెన్ అమౌంట్ కింద చెల్లించారు. కొందరు రైతులు వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గారు. యాచారం మండలం ఫార్మాసిటీ ప్రాంతంలోని మొండిగౌరెల్లి గ్రామంలో సర్వేనెంబర్ 127లో 122 ఎకరాలు, సర్వే నెంబర్ 19లో 575 ఎకరాలు, సర్వే నెంబర్ 68లో 625 ఎకరాలకు సంబంధించి కూడా స్వాధీనం చేసుకునేందుకు మంత్రి పంపిన టీంలు రైతులతో మాట్లాడారు.. అయితే ఈ భూములు ప్రస్తుతం రూ. 5 కోట్ల నుంచి 10 కోట్ల ధర పలుకుతున్నాయి. కానీ మంత్రి పంపిన టీంలు రూ. 20 నుంచి రూ.30 లక్షలు మాత్రమే ఇస్తామని చెప్పడం, కొంత మంది రైతుల ద్వారా ఈ విషయం బయట పడటంతో విక్రయాలు నిలిచిపోయాయి. ఇదే ప్రాంతంలో ప్రస్తుతం క్యాబినెట్లో కీలక పాత్ర పోషిస్తున్న ఓ మంత్రి 40 ఎకరాల అసైన్డ్ భూములను తీసుకుని, ఆ భూమిని ఫార్మాసిటీకి రూ.వేల కోట్లకు అమ్ముకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామ పంచాయతీ పరిధిలో వందల ఎకరాలను అధికార పార్టీ నాయకులు పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఓ పరిశ్రమకు రూ. వేల కోట్లకు అమ్ముకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో అసైన్డ్ భూములు విక్రయాలు జరుగుతున్నప్పటికీ జిల్లా రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
భూ కబ్జాలకు ప్రభుత్వం అండ
జిల్లాలో ఎక్కడ పేదల భూములు కని పిస్తే అక్కడ అధికార పార్టీ నాయకులు కబ్జా లు పెడుతున్నారు. అసైన్డ్ భూములకు ప ట్టాలు ఇప్పించాల్సింది పోయి వారి నుంచి భూములు లాక్కొని సొమ్ముచేసుకునే కుట్రలు చేస్తున్నారు. ఇలాంటి అక్రమ పద్ధతులను సీపీఐ(ఎం) వ్యతిరేకిస్తుంది. ఈ చర్యలకు పాల్పడుతున్న వారిపై రెవెన్యూ అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలి.. లేని పక్షంలో భవిష్యత్తు లో పెద్ద ఎత్తున భూ పోరాటాలు చేపడుతాం.
- సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి - కాడిగళ్ల భాస్కర్