Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పని భారాన్ని తగ్గించాలి : అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి
నవ తెలంగాణ -విలేకరులు
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యూటీ చెల్లించాలని, 45వ ఐఎల్సీ సిఫారసుల ప్రకారం కనీస వేతనం పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించి కార్మికులుగా గుర్తించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 'అంగన్వాడీల ఆలిండియా డిమాండ్స్ డే' సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లుతో కూడిన ఫెక్లీలను ప్రదర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధనాలను నిరిసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ధర్నాలో జయలక్ష్మి పాల్గొని మాట్లాడారు. ఐసీడీఎస్‌ను ప్రయివేటీకరణ చేయొద్దన్నారు. నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని రద్దు చేయాలని, 2018 అక్టోబర్‌లో కేంద్రం పెంచిన వేతనం టీచర్లకు రూ.1500, హెల్పర్లకు రూ.750, మినీ వర్కర్లకు రూ.1250 రాష్ట్ర ప్రభుత్వం ఏరియన్స్తో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. 2017 నుంచి టీఏ, డీఏ బకాయిలు మొత్తం చెల్లించాలని కోరారు. గ్రేడ్ 2 సూపర్వైజర్ నియామకాలను వెంటనే చేపట్టాలన్నారు. పీఆర్సీ ఏరియర్స్ 2021 జులై, అక్టోబర్, నవంబర్, మూడు నెలలవి వెంటనే చెల్లించాలన్నారు. హెల్త్ కార్డు ఇవ్వాలని, వేతనంతో కూడిన మెడికల్ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ యాప్స్ సర్వేలు తగ్గించాలన్నారు. ధర్నా అనంతరం అనంతరం కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. మిర్యాలగూడలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు.
రంగారెడ్డి, వికారాబాద్ కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా లక్కడీకపూల్లోని ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయేందుకు అంగన్వాడీలు ప్రయత్నం చేయగా అంగన్వాడీలను పోలీసులు అడ్డుకు న్నారు. కొంత తోపులాట జరిగిన అనంతరం అదనపు కలెక్టర్ తిరుపతిరావుకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. స్పందించిన అదనపు కలెక్టర్ తమ పరిధిలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టరేట్ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావుకు వినతిపత్రం అందజేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో రాజీవ్ చౌక్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. గద్వాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఏఓకు వినతిపత్రం అందజేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ధర్నా చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ పార్కు ఎదుట అంగన్వాడీ వర్కర్లు ధర్నా చేశారు. అనంతరం రెవెన్యూ అధికారి నారాయణ, ఐసీడీఎస్ అధికారి అశోక్‌కు వినతిపత్రాలు అందజేశారు. కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు ధర్నా చేపట్టారు. సీఐటీయూ కామారెడ్డి జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ కార్మికులకు గ్రాడ్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం చెల్లించి ఈఎస్ఐ, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అమలు చేయాలని కోరారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు.