Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక
- 53 అడుగులు దాటి గోదావరి ప్రవాహం
- జల దిగ్బంధంలో భద్రాచలం ఏజెన్సీ
- పలు గ్రామాలకు రాకపోకలు బంద్
- భద్రాచలంలో వరద పరిస్థితిని సమీక్షించిన మంత్రి పువ్వాడ
నవ తెలంగాణ-భద్రాచలం
భద్రాచలం ఏజెన్సీలో గోదావరి ఒక్కసారిగా ఉప్పొంగింది. 3వ ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహిస్తోంది. పలు ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో పలువురు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం సరిహద్దు ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో సైతం పలు ప్రధాన రహదారులు జలమయం కావడంతో అంతరాష్ట్ర రాకపోకలకు కూడా ఆటంకం ఏర్పడింది. ద్వీపకల్పంలా భద్రాచలం ఏజెన్సీ తలపిస్తోంది. ఇదిలా ఉండగా వరద ఉధృతిని పరిశీలించేందుకు మంత్రి పువ్వాడ అజరు కుమార్ సోమవారం సాయంత్రం భద్రాచలం వచ్చారు. స్థానిక అధికారులతో మంత్రివర్గ సమీక్షా సమావేశం నిర్వహించి తగిన సూచనలు సలహాలు అందజేశారు. అధికారులందరూ స్థానికంగా ఉండి ప్రజలకు తగు సేవలు అందించాలని కోరారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వరద బాధితులకు అన్ని సౌకర్యాలు అందజేయాలని తెలిపారు.
భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక జారీ
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీ జలమయమైంది. సోమవారం ఉదయం 8 గంటలకు 49.40 అడుగులు ఉన్న గోదావరి క్రమేపీ పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకు 51.40, సాయంత్రం 3 గంటలకు 52.60, నాలుగు గంటలకు 53.00, ఐదు గంటలకు 53.20 అడుగులకు గోదావరి చేరుకుంది. 53 అడుగులు దాటడంతో జిల్లా అధికార యంత్రాంగం భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇదిలా ఉండగా చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్టులో ఉన్న 25 గేట్లకు గాను 22 గేట్లు పైకెత్తి 55 వేల క్యూసెక్కుల వరద నీటిని ప్రాజెక్టు అధికారులు దిగువ భాగానికి విడిచిపెట్టారు.
జలదిగ్బంధంలో భద్రాచలం ఏజెన్సీ
భద్రాచలం పట్టణంలోని విస్టా కాంప్లెక్స్, రామాలయం నిత్యాన్నదాన సత్రం, అయ్యప్ప కాలనీ తదితర ప్రాంతాల్లో వరద నీరు రావడంతో స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డు, ఎటపాక రోడ్డుపై వరద నీరు చేరుకుంది. ఆంధ్రాలోని రాయనపేట వద్ద రహదారిపై కూడా నీరు చేరుకుంది. దీంతో భద్రాచలం- సమీప ఆంధ్రలోని కూనవరం -వీఆర్ పురం- చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం తూరు బాకా, బుర్ర వేముల, పర్ణశాల ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరుకోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చర్ల మండలం కుదునూర్ ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో దుమ్ముగూడెం - చర్ల మండలాలకు రాకపోకలు స్తంభించాయి.