Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగాఎదురయ్యే ఆరోగ్య సమస్యల నుండి ప్రజల్ని కాపాడేందుకు వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో సన్నద్ధతతో ఉండాలని సూచించారు. ఆయా ఆసుపత్రుల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి, ఎలాంటి కేసులొచ్చినా అడ్మిట్ చేసుకుని వెంటనే వైద్యం అందించాలని స్పష్టం చేశారు. సోమవారం అన్ని జిల్లాల వైద్యాధికారులు, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, విభాగాధిపతులు, వైద్యులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయా జిల్లాల్లోని పరిస్థితుల గురించి ఆయన ఆరా తీశారు. తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి వివరించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్దంగా ఉండాలన్నారు. ఆయా వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో, స్థానిక ప్రజా ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. 108 వాహనాలు వెళ్ళలేని ప్రాంతాలు ముందే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. బర్త్ వెయిటింగ్ రూములను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తెలిపారు.
హౌస్ సర్జన్లు, జూనియర్ డాక్టర్స్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు సహా డైట్, పారిశుద్ధ్య విభాగాల్లో పని చేసే వారికి వేతనాలు సకాలంలో పొందే విధంగా త్వరిత గతిన బిల్లులను సమర్పించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రుల్లో మందుల రకాల సంఖ్యను 720 నుంచి 843 కు పెంచామనీ, దీంతో 123 రకాల మందులు ప్రభుత్వాస్పత్రుల్లో అదనంగా అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. డాక్టర్లు జనరిక్ మెడిసిన్ సూచించాలనీ, బ్రాండెడ్ మందులు రాయొద్దని కోరారు.