Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివాసీ మహిళలపై దాడులు సరికాదు
- ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి
- టీఆర్ఎస్, బీజేపీ మధ్య వీధినాటకం
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మంచిర్యాల జిల్లాలో ఆదివాసి మహిళలపై దాడి చేసి స్టేషన్‌కు తరలించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వో) రత్నాకర్‌రావును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో సీపీఐ రాష్ట్ర ఇన్‌ఛార్జి కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ బాలమల్లేష్, కలవేరు శంకర్, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్‌తో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేట పంచాయతీ పరిధిలోని కోయపోషగూడెం పోడులో ఆదివాసి మహిళలపై అటవీ, పోలీసు అధికారుల దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. అటవీ, పోలీసు శాఖలు ఒక్కటై ఆదివాసి మహిళలపై దాడి చేశాయని విమర్శించారు. ద్రౌపది దుశ్శాసన పర్వం మాదిరిగా కలియుగ దుశ్శాసనులుగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కేంద్రప్రభుత్వం మద్దతు ఉందనీ, రాష్ట్రం మద్దతు ఉందా? అని ప్రశ్నించారు. ఇక్కడేమో బీజేపీ, టీఆర్ఎస్ ఒకవైపు కోట్లాడుకుంటూ వీధినాటకం ఆడుతున్నాయనీ, మరోవైపు అటవీ, పోలీసు శాఖలు ఒక్కటవుతాయని అన్నారు. గిరిజనులు, పేదలకు అన్యాయం చేసే విషయంలో రెండు అధికార పార్టీలూ ఒక్కటవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీలు, గిరిజనులపై నమోదు చేసిన కేసులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు న్యాయం చేస్తూ, ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. గౌరవెల్లిలో మంత్రి హరీశ్‌రావు చర్చలు జరుపుతామంటునే మరోవైపు భూనిర్వాసిత రైతులను అరెస్ట్ చేసి, బేడీలు వేసి తీసుకుపోతున్నారని చెప్పారు. ఎల్బీ నగర్లో అత్యాచారానికి పాల్పడిన సీఐ నాగేశ్వర్రావుకు రాడిసన్ బ్లూ పబ్ డ్రగ్స్ కేసులో ప్రత్యక్ష సంబంధాలున్నాయని విమర్శించారు. ఆ ఘటనలో అతను దోషే అని అన్నారు. మరో సీఐ విజరు కుమార్ భార్య ఉండగానే ఇంకో మహిళ రెండో భార్యను కోరుకుంటున్నాడని అన్నారు. వాళ్లు పశువులా? మనుషులా? అని ప్రశ్నించారు.
13న మంచిర్యాల డీఎఫ్‌వో కార్యాలయం ముట్టడి : పల్లా
అటవీ అధికారుల దాడులు, అమానుషానికి నిరసనగా మంచిర్యాల జిల్లా డీఎఫ్‌వో కార్యాలయాన్ని ఈనెల 13న ముట్టడించనున్నట్టు సీపీఐ రాష్ట్ర ఇన్‌ఛార్జి కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. అటవీ అధికారులు వైదొలిగి, అక్కడ సాగు చేసుకుంటున్న రైతులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్కరించాలనీ, హక్కుపత్రాలను ఇవ్వాలని కోరారు.