Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ల ముందు నిరసన వాయిదా : వీఆర్వోల సంక్షేమ సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారీ వర్షాల నేపథ్యంలో కష్టకాలంలో ఉన్న ప్రజలకు అండగా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టే రక్షణ చర్యల్లో వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్గొనాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గరికె ఉపేందర్‌రావు, హెచ్.సుధాకర్‌రావు, కోశాధికారి కె.ప్రసాదరావు కోరారు. వీఆర్వోల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తలపెట్టిన కలెక్టరేట్ల ఎదుట నిరసనలను వర్షాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. తదుపరి కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో వరదల వల్ల నష్టపోయిన చర, స్థిర, ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రాణ నష్టాలపై అంచనాలు రూపొందించి అధికారులకు తెలపాలని కోరారు. రెవెన్యూ శాఖలోని అన్ని సమస్యలకు సమగ్ర భూ సర్వే చేపట్టి రికార్డులను నవీకరించడమే ఉత్తమమైన మార్గమని తెలిపారు. రెవెన్యూ శాఖలో క్యాడర్ స్టెంత్ పెంచి నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వీఆర్వో వ్యవస్థ రద్దు తర్వాత రైతుల సమస్యలకు పరిష్కారం లభించకపోగా భూ సమస్యలు మరింత పేరుకుపోయాయని తెలిపారు. అశాస్త్రీయ నిర్ణయంతో ప్రజలు, రైతులు, ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని కోరారు.