Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎంలకు సింగరేణి డైరెక్టర్ల ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సింగరేణి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఉపరితల గనుల్లో ఉత్పత్తికి విఘాతం కలుగుతున్న నేపథ్యంలో భూగర్భ గనుల నుంచి అధికోత్పత్తిని సాధించాలని ఆ సంస్థ డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్ (ఆపరేషన్స్), ఎన్.బలరామ్ (ఫైనాన్స్, పి అండ్ పి, పర్సనల్) డి.సత్యనారాయణరావు (ఈ అండ్ ఎం) ఏరియా జనరల్ మేనేజర్లను ఆదేశించారు. ఈ మేరకు భూ గర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణిలోని రామగుండం 1 ఏరియా, మందమర్రి, భూపాలపల్లి, శ్రీరాంపూర్ ఏరియాల్లోని 21 భూగర్భ గనుల్లో గత ఏడాది ఆరు గనులు మాత్రమే 100 శాతం ఉత్పత్తిని సాధించాయని తెలిపారు. ఈ ఏడాది తొలి త్రైమాసికం చివరికి కేవలం నాలుగు గనులు మాత్రమే ఉత్పత్తి లక్ష్యాలను చేరుకున్నామని చెప్పారు. కానీ వంద శాతం లక్ష్యాలు సాధించేందుకు పూర్తి స్థాయిలో కషి చేయాలని సూచించారు. ఈ గనుల్లో పనిచేస్తున్న ఎస్డీఎల్ యంత్రాలు సగటున రోజుకు 150 టన్నుల ఉత్పత్తి సాధించాలనీ, అవసరమైన కార్మికులను ఉత్పత్తిలో వినియోగించుకోవడానికి తగు చర్యలు తీసుకుంటూ, బొగ్గు రవాణాకు టబ్బుల కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. భూగర్భ గనుల్లో కార్మికుల గైర్హాజరును తగ్గించాలనీ, దీర్ఘ కాలంగా విధులకు రాని కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా గనుల వారీగా నెలకొన్న సమస్యలపై చర్చించారు.