Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ
- అరసం- ప్రజానాట్యమండలి శిక్షణా శిబిరం ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సామాన్య ప్రజల గుండెల్లోకి దూసుకెళ్లేలా పాటల బాణీలను అల్లాలని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ కవువు, రచయితలకు సూచించారు. ఆ పాట భావం సూటిగా అర్థమయ్యేలా ఉండాలన్నారు. సీపీఐ రాష్ట్ర, జాతీయ మహాసభల గౌరవార్దం అభ్యుదయ రచయితల సంఘం (అరసం), ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను సోమవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆత్రేయ, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి మొదలైన వారి గీతాలతోపాటు తాను రాసిన సినీ గీతాలను అశోక్‌తేజ విశ్లేషించారు. వాటి నేపథ్యాలను వివరించారు. ఔత్సాహిక గీత రచయితలకు సలహాలు, సూచనలుగా పడికట్టు పదాలను వదిలేసి, ప్రజల బాణీ, వాణిలోనే భావాన్ని బలంగా వ్యక్తం చేయాలని సూచించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ కళ కళ కోసం కాదు ప్రజల కోసం అనేది పాత మాటఅనీ, కళ కళ కోసం కాదు కార్పొరేట్ వర్గాల కోసం అన్నది నేటి మాట అని అన్నారు. కళమాతల్లినీ పాలకులు హైజాక్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర ఇన్‌ఛార్జి కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ధరలను అరికట్టడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఆ పార్టీ వైఫల్యాలు, మతోన్మాద విధానాలు, ప్రయివేటీకరణ, ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం వంటి విషయాలపై పాటలు రాయాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావు మాట్లాడుతూ సమాజ మార్పు కోసం అవసరమైన సాంస్కృతిక సైన్యం తయారు కావాలని చెప్పారు. తెలంగాణ ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేరు శంకర్, తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కె శ్రీనివాస్, తెలంగాణ అరసం ప్రధాన కార్యదర్శి రాపోలు సుదర్శన్, కార్యదర్శి కేవీఎల్, తెలంగాణ ప్రజా నాట్యమండలి వర్కింగ్ ప్రెసిడెంట్ కేతరాజు ఉప్పలయ్య, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్ర నాయక్, ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, నాయకులు గని తదితరులు పాల్గొన్నారు.