Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధాని మోడీ ఎనిమిదేండ్ల పాలనలో ఒక్క ప్రెస్ మీటైనా పెట్టారా? అని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్లో ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు ఏ.వెంకటేశ్వర్ రెడ్డి, భూపాల్ రెడ్డిలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రెస్ మీట్ పెడితే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయం మోడీని వెంటాడుతున్నదని ఎద్దేవా చేశారు. దేశంలో ఎప్పుడు లేనంతగా అప్పులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ విధానాల వల్లే తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని చెప్పారు. ఆంధ్రాకు నీళ్లు తరలిస్తుంటే మంత్రిగా హారతి పట్టిన డి.కె.అరుణకు కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రధాని మోడీ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ బీసీ గణన చేయరు.. బీసీ లకు మంత్రిత్వ శాఖ ఇవ్వబోరని విమర్శించారు. ఏ. వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రెస్మీట్ తర్వాత బండి సంజరుకు పిచ్చెక్కిందనీ, తెలంగాణ కన్నా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏదైనా మంచి జరిగితే చెప్పాలని సవాల్ విసిరారు.