Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుండపోత.. ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం
- గేట్లు ఎత్తి దిగువకు విడుదల
- పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు
- ఎస్సారెస్పీ 25 గేట్ల ద్వారా నీటి విడుదల
- చెరువులను తలపిస్తున్న సింగరేణి ఓపెన్ కాస్టులు
- జగిత్యాలలో గోదావరి మధ్యలో చిక్కుకున్న రైతులు
- ఆ వార్తను కవర్ చేసేందుకు వెళ్లిన రిపోర్టర్ గల్లంతు
ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ముసురుతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. ఎక్కడ చూసినా వరద నీరే. పంట పొలాలు వరదతో నిండిపోయాయి. వరద తాకిడికి రోడ్లు కోతకు గురవడం.. కొట్టుకుపోయాయి. ధారాళంగా చినుకు పడుతూనే ఉండటంతో గోడలు నాని.. ఇండ్లు కూలిపోయాయి. చెరువులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులు నీటితో నిండటంతో గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. సింగరేణి ఓపెన్ కాస్టుల్లో వరద చేరడంతో ఉత్పత్తి పూర్తిగా బంద్ అయింది. వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. ప్రజాప్రతినిధులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, సహాయక చర్యలను పరిశీలించారు. జగిత్యాల జిల్లాలో గోదావరి మధ్యలో చిక్కుకున్న రైతులను కాపాడే రెస్క్యూ ఆపరేషన్ సమయంలో వార్త కవరేజ్ కోసం వెళ్లిన ఓ రిపోర్టర్ గల్లంతయ్యాడు.
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
పెద్దపల్లి జిల్లా మొత్తం అతలాకుతలమవుతోంది. మరో 48 గంటలపాటు జిల్లాలో అతి భారీ వర్షాలు కురియనున్నట్టు వాతావరణ శాక ప్రకటించగా, జిల్లాకు రెడ్ అలర్ట్‌గా ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా కేంద్రంలో రంగంపల్లి, పెద్దబొంకూరు గ్రామాల వద్ద ఆర్టిఎ కార్యాలయం దగ్గర కల్వర్టుపై భారీగా వరద నీరు చేరి రాజీవ్ రహదారిపై నుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. శ్రీరాంపూర్ మండలంలో కల్వర్డుపై నీటి ప్రవాహంలో కారు చిక్కుకోగా.. స్థానికులతో కలిసి ఎస్ఐ కారును బయటకు తెచ్చారు. జిల్లా వ్యాప్తంగా 44 ఇండ్లు పాక్షికంగా, 40 ఇండ్లు పూర్తిగా కూలిపోయినట్టు అధికారులు ప్రకటించారు. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుల్లోని సరస్వతి, లక్ష్మి బ్యారేజీల నుంచి 80 గేట్లు ఎత్తారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న పైర్లు నీటిలో మునిగిపోయాయి. ఓదెల మండలం గుంపుల గ్రామాన్ని ఆనుకొని ఉన్న ఊరు చెరువు వల్ల చుట్టూ ఉన్న గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది.
రామగుండం ఆర్ఎఫ్సీఎల్ బూడిద చెరువు కట్ట తెగి వరద నీరు శాంతినగర్, తదితర ఏరియాల్లోని ఇండ్లలోకి చేరింది. వరద నీటి ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించి పరిశీలించారు.
సింగరేణిలో నిలిచిన ఉత్పత్తి
సింగరేణి రామగుండం రీజియన్‌లో నాలుగు ఓసీపీల్లో రోజుకు లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. సర్ఫేస్ కోల్ యార్డులో బొగ్గు నిల్వలు అడుగంటడంతో అత్య వసర పరిస్థితుల్లోనూ రవాణా చేయలేని పరిస్థితి నెలకొంది. ఓపెన్ కాస్టులు చెరువులను తలపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలోని మానేర్ డ్యాంతో ముంపునకు గురైన నేదునూరు గ్రామంలోని గోసంగి కాలనీలో దెబ్బతిన్న ఇండ్లను కలెక్టర్ ఆర్వీకర్ణన్, ఎమ్మెల్యే రసమయి పరిశీలించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్దండి గ్రామ తీరాన ఉన్న గోదావరి ప్రాంతాన్ని కలెక్టర్ రవి, ఎస్పీ సింధు శర్మ పరిశీలించారు. వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల గ్రామ సమీపంలోని గోదావరి రేవు వద్ద ఎల్లంపల్లి బ్యాక్ వాటర్‌లో మృతదేహం కొట్టుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పట్టణంలోని సంగారెడ్డి రోడ్డులో భారీ చెట్టు రోడ్డుపై పడింది. అధికారులు జేసీబీ సాయంతో చెట్టును తొలగించారు. కొండాపూర్ డివిజన్లోని ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పర్యటించారు. నారాయణపేట జిల్లా ఊట్కురు మండల కేంద్రంలో ఇల్లు కూలింది. బాలానగర్‌లో అంజనేయ స్వామి ఆలయంలో నీరు చేరింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయా, కంది వంటి ప్రధాన పైర్లు నీట మునిగాయి. మామడ మండలం దిమ్మ దుర్తి వద్ద రహదారి కోతకు గురికావడంతో నిర్మల్- మంచిర్యాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనేకచోట్ల లోలెవల్ వంతెనలు, రహ దారులు కొట్టుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ప్రధా న నదులైన గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగా ఉగ్రరూపం దాల్చాయి. పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శ్రీరాంసాగర్, స్వర్ణ, అడ, వట్టివాగు, సాత్నాల, మత్తడివాగు, ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తేసి దిగువకు వదులుతున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ జిల్లాలో పర్యటించారు.
నిలకడగా గోదావరి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరికి వరద తగ్గుముఖం పట్టింది. రాత్రి ఏడు గంటలకు 51.70 అడుగుల వద్ద నిలకడగా ఉంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు పైకి ఎత్తి 1,68,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బూర్గంపాడులో పునరావాస కేంద్రాన్ని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సందర్శించారు.
మూడ్రోజుల్లోనే నిండిన ఎస్సారెస్పీ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మూడ్రోజుల్లోనే నిండుకుండలా మారిం ది. ఈ నెల 9న ప్రాజెక్టులో 35 టీఎంసీల నీటి మట్టం ఉండగా.. 35 వేల క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే ఉంది. మంగళవారం మధ్యాహ్న ం నుంచి ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ రాత్రి వరకు 1.71 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. మొత్తం 44 టీఎంసీల నీరు ప్రాజెక్టు లోకి చేరింది. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తు తం 74 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ చేస్తున్నారు. మిగిలిన జలాల ను దిగువకు వదులుతున్నారు. ఒకవేళ ప్రాజెక్టు గేట్లు ఎత్తకుండా నీటిని నిల్వ చేస్తే బ్యాక్ వాటర్ వల్ల బోధన్, నవీపేట్, రెంజల్ మండలాల్లోని పలు గ్రామాల్లోకి వరద నీరు చేరుతుందని ముందస్తు చర్యలు చేపడుతున్నారు. 26 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టును సందర్శించిన మంత్రి
ఐదు రోజులుగా ఎడతెరిపి లేని వర్షానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుండి అధిక వరద కొనసాగడంతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాలలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరివాహక ప్రాంత ప్రజలను ఎటువంటి హాని జరుగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. గోదావరి నది పరివాహక ప్రజలు నది తీరంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని నిర్మల్, నిజామాబాద్ జిల్లాల పరివాహక ప్రజలను కోరారు.
ఎమ్మెల్యేల పరిశీలన
ఏఐసీసీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని వరద ముంపు గ్రామాల్లో పర్యటించారు. దెబ్బతిన్న చెరువులు, కుంటలను పరిశీలించారు. వీరాపూర్ ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో పలు మండలాలు వరద నీటితో అతలాకుతలం అయ్యాయని, వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు.
ములుగు జిల్లా మంగపేట మండలం కేంద్రంలో గోదావరి ముంపు గ్రామాల పునరావాస కేంద్రాలను కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతయ్య సందర్శించారు. వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు. లోతట్టుప్రాంతాల ప్రజలు, గోదావరి పరివాహ మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏటూరునాగారం మండలం షాపల్లిదొడ్ల గ్రామంలో ఇండ్లు కూలిపోయిన వారికి బియ్యం, నిత్యావసరాలు అందజేశారు.
వరద ప్రవాహం నేపథ్యంలో నాగర్‌కర్నూలు జిల్లా పరిధిలోని శ్రీశైలం వెనుక జలాల్లో చేపల వేటపై నిషేధం విధించినట్టు అధికారులు తెలిపారు.
ఎగువనున్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో.. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరద చేరుతోంది.
హైదరాబాద్ పాతబస్తీ నెహ్రూ జూలోని సఫారీ పార్కులోకి భారీగా వరద చేరింది. దీంతో సఫారీ పార్కును తాత్కాలికంగా మూసేసినట్టు జూ అధికారులు తెలిపారు. ఇది మినహా జూపార్కు తెరిచే ఉంటుందన్నారు.
హైదరాబాద్ జంట జలాశయాల గేట్ల ఎత్తు తగ్గించి మిగులు జలాలను మూసీలోకి వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ రెండు గేట్లు చొప్పున ఎత్తారు.
మేడ్చల్ జిల్లా, కీసర మండలం, రాంపల్లిలో కరెంట్ తీగ తెగిపో యి కిందపడిపోయింది. ఆ సమయంలో ఎవరూ రాకపోవడంతో ఎటువంటి ప్రాణహాని జరగలేదు.
హైదరాబాద్, ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్వద్ద కరెంట్ తీగ తెగి పడింది. వనస్థలిపురం గణేష్ టెంపుల్ వద్ద చెట్టు విరిగి ట్రాన్స్‌ఫారమ్ పక్కన గోడపై పడింది.
గోదావరి మధ్యలో చిక్కుకున్న రైతులు..
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి వద్ద గోదావరినది మధ్యలో ఓ కుర్రు(ఎత్తైన గడ్డ)పై తొమ్మిదిమంది రైతులు చిక్కుకున్నారు. గోదావరి ప్రవాహం ఉధృతి పెరగడంతో బోర్నపెల్లి గ్రామ రైతులు కుర్రు (ఐలాండ్) ప్రాంతం నుంచి బయటకు రాలేకపోయారు. కలెక్టర్ రవి, అధికారులు పరిసర ప్రాంతానికి వెళ్లి రైతులతో ఫోన్లో మాట్లాడారు. బోర్నపెల్లి, చిట్యాల గ్రామాల చుట్టూ గోదావరి తీర ప్రాంతం ఉండటంతో.. అవతలి వైపు నిర్మల్ జిల్లా కడెం మండలం చిట్యాల గ్రామం నుంచి తహసీల్దార్ దిలీప్ నాయక్, సీఐ కృష్ణకుమార్ సహాయ చర్యల కోసం పరిశీలించారు. బోట్ల ద్వారా వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాగా, ఈ రెస్క్యూ ఆపరేషన్ సమయంలో న్యూస్ కవరేజ్ కోసం ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్లరు కారులో వెళ్తుండగా.. వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది. అందులో నుంచి ఒకరు ఒడ్డుకు చేరుకున్నారు. మరో రిపోర్టర్ ఆచూకీ తెలియలేదు.