Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకిచ్చిన హామీలను విస్మరించిన మోడీ
- జులై 31న దేశ వ్యాప్త ఆందోళనలు
- పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తేయాలి
- ఎంఎన్ఆర్ఈజీఏ కింద రెండు ఆవులు ఇవ్వాలి : ఏఐకేఎస్ జాతీయ నేత కృష్ణప్రసాద్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) కోశాధికారి కృష్ణ ప్రసాద్ విమర్శించారు. కార్పొరేట్ల సేవలో తరిస్తూ... రైతులను విస్మరిస్తున్నారని చెప్పారు. ఏడాదిపాటు కొనసాగిన రైతాంగ ఉద్యమం చారిత్రాత్మకమైందని చెప్పారు. ఆ ఉద్యమానికి తలొగ్గి మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రైతులకు ఇచ్చిన వాగ్దానాలను ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. ఆ ఉద్యమ ప్రభావం శ్రీలంకపై కూడా ఉందనీ, దేశంలోనూ శ్రీలంక పరిస్థితులు రాబోతున్నాయని చెప్పారు. రెండు రోజులపాటు నిర్వహించే ఏఐకేఎస్ వర్క్‌షాప్ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన... హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం నేతలతో కలిసి విలేకర్లతో మంగళవారం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మూడు రైతు చట్టాలను రద్దు చేయడం రైతుల చారిత్రక విజయమని చెప్పారు. ఏడాదిపాటు రైతులు శాంతియుతంగా ఆ ఉద్యమాన్ని నిర్వహించారని గుర్తు చేశారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోబోదని రైతు ఉద్యమం నిరూపించిందన్నారు. అయినా ఇప్పటికీ మోడీ ప్రభుత్వం రైతుల డిమాండ్లు నెరవేర్చలేదని విమర్శించారు. 2014 బీజేపీ మ్యానిఫెస్టోలో స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని హామీ ఇచ్చిన మోడీ మాటతప్పారని అన్నారు. మద్దతు ధరలు, రుణవిమోచన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జూలై 31 సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఇచ్చిన చక్కా జామ్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ధర్నాలు, నిరసనలు, రోడ్లబంద్ తదితర కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. కేంద్రం పాల రైతుల సమస్యలు కూడా పరిష్కారం చేయాలనీ, పాల ఉత్పత్తులపై విధిస్తున్న జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆయా ఉత్పత్తులపై కేంద్రం 18శాతం జీఎస్టీ పెంచిందని విమర్శించారు. దీని ప్రభావం దేశంలో 9 కోట్ల మంది రైతులపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట కంపెనీల మద్దతు కోసమే మోడీ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. పాల రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంతకాల సేకరణ చేపడతామనీ, వాటిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతరామన్కు అందజేస్తామని చెప్పారు. ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద కేరళ ప్రభుత్వం రెండు గేదెలను ఇస్తున్నదనీ, అదే తరహాలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు ఏడాదికి రెండు వందల రోజులపాటు పని కల్పించాలని కోరారు. ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లా రెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా రైతు రుణాలను మాఫీ చేయాలని డిమాండ్‌చేశారు. కేంద్రం కనీస మద్దతు ధర అమలు చేయకపోవడం వల్ల వారు ఏటా రూ 5 లక్షలకోట్లు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా 12,600 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రైతుల రుణాలు మాఫీ చేయాలని కోరారు. రైతు బంధు డబ్బులను బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోవడం సరైందికాదన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ పోడుసాగుదార్లు తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆయా భూములకు హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి ఏండ్లు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలుచేయలేదని విమర్శించారు. పోడు భూముల సమస్యపై వేసిన మంత్రుల కమిటీ ఏమైంది? అని ప్రశ్నించారు. సంబంధిత దరఖాస్తులు స్వీకరించి ఎందుకు పరిశీలించడం లేదని నిలదీశారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా పోడు రైతులకు హక్కు పత్రాలు ఇస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ నెలబెట్టుకోవాలని కోరారు. లేదంటే భవిష్యత్తులో పోరాటాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శులు మూడ్ శోభన్, లెల్లెల బాలకృష్ణ తదితరులు ఉన్నారు.