Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎండమిక్ స్థాయికి కరోనా, మలేరియా
- రోడ్ల పక్కన తిండ్లతో ప్రమాదం
- నివారణ చర్యలు చేపట్టాం..
- ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి : డీహెచ్ డాక్టర్ జి.శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా, మలేరియా వ్యాధులు తగ్గుముఖం పట్టాయనీ, అవి రెండు ఎండమిక్ స్థాయికి వచ్చాయని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. రాబోయే రోజుల్లో కరోనా ఒక సాధారణ ఫ్లూ మాదిరిగా మారే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఏదైనా కొత్త వేరియంట్ వస్తే తప్ప మునపటిలా కరోనాతో ఇబ్బందులు తలెత్తే పరిస్థితి లేదని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయనమాట్లాడారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో డెంగ్యూ, టైఫాయిడ్ కేసులు పెరిగాయని చెప్పారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆహారం, నీరు కలుషితమయ్యే ప్రమాదముందనీ, ప్రజలు పానీపూరీ తదితర రోడ్ల పక్కన తిండ్లకు దూరంగా ఉండాలని సూచించారు. విషజ్వరాలు ప్రబలే ప్రమాదముందనీ, అప్రమత్తంగా ఉండాలని కోరారు. 'బ్యాక్టీరియా, వైరస్‌తో సీజనల్ వ్యాధులు వస్తాయి. వర్షాలు పడే సమయంలో అవసరమైతేనే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దు. కరోనాకు ముందు 2019లో వేలల్లో డెంగ్యూ కేసులొచ్చాయి. అప్పుడు కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 1,184 వచ్చాయి. వీటిలో అత్యధికంగా హైదరాబాద్‌లో 516, కరీంనగర్లో 84, కరీంనగర్లో 82, మహబూబ్‌నగర్‌లో 54, మేడ్చల్‌లో 55, పెద్దపల్లిలో 40, సంగారెడ్డిలో 97 ఉన్నాయి. జూన్‌లో 563 కేసులు రాగా.. జులైలో తొలి 10 రోజుల్లోనే 222 కేసులొచ్చాయి. దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహిస్తున్నాం. దీన్ని పెంచాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులకు ఆదేశాలిచ్చాం. మున్సిపల్, పంచాయితీరాజ్, వైద్య ఆరోగ్యశాఖల సమన్వయంతో యాంటీ లార్వా ఆపరేషన్లు చేపడుతున్నాం. రెండు, మూడు జిల్లాల నుంచి మలేరియా కేసులొస్తున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి, ములుగులోనే ఎక్కువగా నమోదవుతున్నాయి .... ' అని డీహెచ్ తెలిపారు. 'ఈ ఏడాది టైఫాయిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మేలో 2,700, జూన్‌లో 2,752 కేసులు వచ్చాయి. ప్రజలు సరైన ఆహారాన్ని, మంచినీరు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధుల నుంచి సురక్షితంగా బయటపడొచ్చు. ప్రతి ఫ్రైడే.. డ్రై డే (శుక్రవారం - పొడివారం) కార్యక్రమం చేపట్టాలి. వేడివేడి ఆహారాన్ని తీసుకోవాలి. నీరు రంగుమారితే తప్పకుండా కాచి చల్లార్చి తాగాలి. జలుబు, జ్వరం, విరేచనాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో టెస్ట్ కిట్లు సిద్ధంగా ఉన్నాయి. గర్భిణిలు డ్యూ డేట్ కంటే ముందే ఆస్పత్రిలో చేరి వైద్యం తీసుకోవాలి. బాలింతలు, చంటి పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. జలుబు, జ్వరం ఉంటే ఇంట్లోనే ఉండి మాస్క్ ధరిస్తూ ఐసోలేషన్ పాటించాలి... ' అని డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు.
సీజనల్ వ్యాధిలా కోవిడ్-19
'కొవిడ్-19 ముగిసింది. అయితే ఆరు వారాలుగా కొవిడ్ కేసుల సంఖ్య పెరిగింది. అయినా భయపడాల్సిన పనిలేదు. ఇది ఎండమిక్ దశకు చేరుకుంది. సాధారణ జలుబు, జ్వరం లక్షణాలు ఉంటాయి. కొవిడ్ కూడా ఓ సీజనల్ వ్యాధిగా మారిపోయింది. లక్షణాలుంటే కేవలం 5 రోజులే క్వారంటైన్లో ఉండాలి. కరోనా లక్షణాలు లేని వారికి నిర్ధారణ పరీక్షలు అవసరం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త నిబంధనల ప్రకారం లక్షణాలు లేనివారికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయడం లేదు. కొవిడ్ సోకి శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వారు మాత్రమే ఆస్పత్రిలో చేరాలి. ప్రయివేటు ఆస్పత్రులు అవసరం లేకుండా ప్లేట్లెట్ల మార్పిడి చేయొద్దు. ప్రజల బలహీనతను వ్యాపారంగా మార్చుకోవద్దు. అత్యవసరమయితేనే అయితే ప్లేట్లెట్ చికిత్సను అందించాలి' అని శ్రీనివాస్‌రావు కోరారు.