Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడు లక్షల దరఖాస్తుల్లో లక్ష ఇండ్లు ఎవరికిస్తారు?
- జీహెచ్ఎంసీ వద్ద ధర్నాలో సీపీఐ(ఎం) నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్
- దరఖాస్తుల పరిశీలన ప్రారంభమైంది: కమిషనర్ లోకేష్‌కుమార్
నవతెలంగాణ-సిటీబ్యూరో
'ఏడాదికి లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టిస్తామన్నారు. ఎనిమిదేండ్లల్లో కట్టింది లక్ష ఇండ్లే. దరఖాస్తులు మాత్రం 7 లక్షలు ఉన్నాయి. ఈ లక్ష ఇండ్లను ఎవరికిస్తారు? మిగిలిన దరఖాస్తుదారులకు ఎప్పుడిస్తారు? ఎక్కడ నిర్మిస్తారు? ఆ ఇండ్లను కూడా సీపీఐ(ఎం) పోరాటాల ఫలితంగానే నిర్మించారు. పూర్తయిన ఇండ్లను ఇవ్వడానికి లబ్దిదారులను ఎందుకు గుర్తించలేదు. ఇంతకు డబుల్ ఇండ్లను ఇస్తరా? ఇవ్వరా?' అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ప్రశ్నించారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వర్షాన్ని లెక్కచేయకుండా పేదలు పెద్దఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌లో సొంత ఇండ్లు లేని పేదలు ఎంతోమంది ఉన్నారని, పెరుగుతున్న అద్దెలను చాలిచాలని ఆదాయాలతో చెల్లించలేక దుర్భర జీవితాలు గడుపుతున్నారని చెప్పారు. నగర శివారులో పూర్తయిన వేలాది ఇండ్లను కేటాయించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని, ఎనిమిదేండ్లల్లో పేదలకు పంపిణీ చేసింది 3,300 ఇండ్లు మాత్రమేనని గుర్తుచేశారు.
గ్రేటర్లో ఇండ్ల కోసం 7లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటి వరకు దరఖాస్తుల పరిశీలన చేయలేదని, లబ్దిదారుల గుర్తింపు ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బస్తీల్లో గుడిసెల స్థానంలో ఇండ్లను నిర్మిస్తామని పేదలను ఖాళీ చేయించిందన్నారు. ఇండ్ల నిర్మాణం పూర్తికాక, మధ్యలోనే ఆగిపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. భోజగుట్టలో 1800 నిర్మాణాలకు ప్లాన్ చేసి 500 ఇండ్లను మాత్రమే ప్రారంభించి.. వాటిని కూడా మధ్యలోనే ఆపేశారని గుర్తుచేశారు. సొంత స్థలం ఉన్న పేదలకు ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించినప్పటికీ ఈ ప్రక్రియను ప్రారంభించలేదన్నారు. సొంత జాగా ఉన్న వారి ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వాలని, ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. శివారు ప్రాంతాల్లో కాకుండా నగరం మధ్యలో ఉన్న ఖాళీ స్థలాల్లోనూ ఇండ్లను నిర్మించాలని, కొత్త దరఖాస్తుదారులకు అవకాశం కల్పించాలని కోరారు. ఇండ్ల లబ్దిదారుల గుర్తింపును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
కమిషనర్‌కు మెమోరాండం
ధర్నా అనంతరం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్‌కు మెమోరాండం అందజేశారు. ఇండ్ల నిర్మాణం, లబ్దిదారుల గుర్తింపు, దరఖాస్తుల పరిశీలన అంశాలపై కమిషనర్‌తో చర్చించారు. ఈ విషయంపై స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నామని, ప్రతి నియోజకవర్గానికీ 4వేల ఇండ్ల చొప్పున కేటాయించాలని నిర్ణయించామని తెలిపారు. నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులకు సంబంధించిన వివరాలను తయారు చేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ధర్నాలో సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్‌రావు, ఎం.దశరథ్, ఎం.మహేందర్, ఎం.వెంకటేష్, కెఎన్.రాజన్న, సభ్యులు అజరుబాబు, జె.కుమారస్వామి, ఆర్.వెంకటేష్, జి.కిరణ్, అశోక్, సి.మల్లేష్, ఆర్.వాణి, జి.నరేష్, తదితరులు పాల్గొన్నారు.