Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమార్కుల చెరలో స్థలాలు
- జాబ్లకోసం చెన్నైలో అక్కరకురాని శిక్షణ
- రోడ్డునపడిన కార్మికులు
- అమలుకాని మంత్రి హామీలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో లెదర్ పార్కుల కోసం ఎదురు చూస్తున్నది ఒకరిద్దరే కాదు..వేలాదిమంది ఈ పరిశ్రమ కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇది గమనించిన నాటి ప్రభుత్వం కొందరికైనా ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో సుమారు రెండు వేల మందికి చెన్నైలో శిక్షణ ఇప్పించింది. జిల్లాకొక మిని లెదర్ పార్కు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని తలంచింది. అందుకు తగిన విధంగా భూములను కేటాయించింది. శంఖుస్థాపనలు చేసింది. కొన్ని చోట్ల నిర్మాణాలు కూడా చేపట్టింది. కానీ..అవి ఇప్పుడు పడాపు పడ్డ బంగ్లాలుగా తయారయ్యాయి. కొన్ని చోట్ల వాటికి కేటాయించిన భూములను కూడా ఆక్రమించుకుంటున్నా రన్న విమర్శలొస్త్తున్నాయి.
మూలన పడ్డ మెగా లెదర్ పార్కు..
మెగా లెదర్ పార్క్ ముచ్చటగా మూలకు పడ్డది. మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చి ఆరెండ్లవుతున్నా అతీగతీ లేదు. 2018 డిసెంబర్ కల్లా రూ. 270 కోట్ల పెట్టుబడులతో స్టేషన్ ఘన్‌పూర్‌లో లెదర్‌పార్క్ పెట్టి, 20 వేల మందికి ఉపాధి కల్పిస్తామని2016లో అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రకటించారు. మూతపడ్డ మినీ లెదర్ పార్కులను కూడా తెరిపిస్తామన్నారు. సర్కారు నుంచి వచ్చిన ఆదేశాలతో అప్పట్లో ఆఫీసర్లు స్టేషన్‌ఘన్‌పూర్‌లో భూసేకరణ పేరిట కొద్దిరోజులు హడావుడి చేశారు. కానీ.. ఇప్పటికీ ఇటు మినీ లెదర్ పార్కులు లేవు.. అటు మెగా లెదర్ పార్క్ లేదు. మెగా లెదర్పార్క్కు అనుబంధంగా ఆయా జిల్లాల్లో మూతపడిన 9 మినీ లెదర్పార్క్లనూ పునరుద్ధరిస్తామని కేటీఆర్ చెప్పారు. గతంలోనే లిడ్ క్యాప్ (లెదర్ ఇండిస్టీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో ఆఫీసర్లు ఆయా జిల్లాల్లోని 2 వేల మంది నిరుద్యోగ యువతను సెలెక్ట్ చేసి చెన్నైలో ట్రైనింగ్ ఇప్పించారు. కొన్నిచోట్ల మినీ లెదర్పార్క్లు ఓపెన్‌చేసి వీళ్లలో కొందరిని ఉద్యోగాల్లోకి తీసుకున్నా పాలకుల నిర్లక్ష్యం వల్ల అన్నీ మూతపడ్డాయి. దీంతో నాడు ట్రైనింగ్ తీసుకున్నవాళ్లంతా ఇప్పుడు రోడ్ల పక్కన చెప్పులు కుట్టుకుంటూ భారంగా బతుకులు వెళ్లదీస్తున్నారు.
లెదర్ ఉత్పత్తులకు డిమాండ్..
రాష్ట్రంలో లెదర్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ఏటా రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల వ్యాపారం జరుగుతున్నది. స్థానికంగా వీటి ఉత్పత్తి తగిన రీతిలో లేదు. ఉత్తర భారతం, ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నదని స్థానిక ఉత్పత్తి దారులు చెబుతున్నారు. మన దగ్గరే వీటిని ఉత్పత్తి చేస్తే స్థానికులకు ఉపాధి దొరుకుతుంది. దీంతో పాటు తక్కువ రేట్లకు లెదర్ ఉత్పత్తులను మన ప్రజలకు అందించాలని గత ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ క్రమంలోనే నాగర్ కర్నూల్జిల్లా జినుకుంట, ఖమ్మం జిల్లా మల్లెమడుగు, జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్, మంచిర్యాల జిల్లా మందమర్రి, సిద్దిపేట జిల్లా దుద్దెడ, నిజామాబాద్ జిల్లా ఆర్మూరు, నల్గొండ జిల్లా దండెంపల్లి, కరీంనగర్ జిల్లా రుక్మాపూర్, మహబూబ్‌నగర్ జిల్లా పోలేపల్లిలో 9 మినీ లెదర్ పార్క్‌ల ఏర్పాటుకు నిర్ణయించాయి. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో లెదర్పార్క్లు మూతపడ్డాయి. ఉద్యోగులు రోడ్డునపడ్డారు.
మినీ లెదర్ పార్క్‌ల పరిస్థితి ఇదీ
2004లో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి, బల్మూర్ మండలం జినుకుంటలో అప్పటి ప్రభుత్వం మినీ లెదర్ పార్క్‌లు ఏర్పాటు చేసింది. 25 ఎకరాల్లో లెదర్‌పార్క్ బిల్డింగ్ ,అందులో రూ.2 కోట్ల విలువైన మిషన్లు ఏర్పాటు చేసింది. 200 మంది నిరుద్యోగ యువతను సెలెక్ట్ చేసి చెన్నై లో ట్రైనింగ్ ఇప్పించారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో పాలవాగు ఒడ్డున 25 ఎకరాల్లో 2007 ఫిబ్రవరి 1న అప్పటి కార్మిక శాఖ మంత్రి గడ్డం వినోద్ లెదర్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. రెండేళ్ల తర్వాత 2009 ఫిబ్రవరి 23న అప్పటి సీఎం వైఎస్ ప్రారంభించారు. 300 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. కేవలం షెడ్డు నిర్మించి వదిలేశారు.నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని దండెంపల్లిలో 2002 అక్టోబర్ 26న ఆధ్రప్రదేశ్ చర్మ పరిశ్రామాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మినీ లెదర్ పార్కును ప్రారంభించారు. కోదాడ, హూజూర్‌నగర్, సూర్యాపేట, భువనగిరి ప్రాంతాలకు చెందిన దాదాపు 30 మంది వరకు చెన్నైలోని కేంద్ర లెదర్ పరిశోధన సంస్థ(సీఎల్ఆర్ఐ) ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. వారంతా ఇప్పుడు రోడ్డున పడ్డారు.మిగతా పార్కుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు.
అభివృద్ధి పనులు చేపట్టాం..
డి శ్రీనివాస్ నాయక్, ఎమ్డీ టీఎస్‌ఎల్‌ఐపీసీ
మినీ లెదర్ పార్కులలో ప్రస్తుతమున్న షెడ్ల మరమ్మతులతో పాటు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టాం.ఒక్కో పార్కును ఒక్కో విధమైన ఉత్పత్తికి ప్రత్యేకంగా కేటాయించాలని నిర్ణయించాం. ఎంఎన్‌సీలను ఆహ్వానించేందుకు సీఎల్ఆర్ఐ ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను (ఈఓఐ)ను పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రఖ్యాతిగాంచిన బ్రాండ్ల ఉత్పత్తులు రాష్ట్రం నుంచే తయారు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం.
'మెగా లెదర్ పార్కుకోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నాం. ఆ పరిశ్రమలో పనిచేసేందుకు శిక్షణ కూడా తీసుకున్నాం. కానీ..ఇప్పటి వరకు ఆ పార్కులు రాలే. చిన్న లిడ్‌క్యాప్ డబ్బాలో చెప్పులు రిపేరు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను'...
- నర్సయ్య జనగామ.
టీడీపీ సర్కారు 2003లో స్టేషన్‌ఘన్‌పూర్‌కు మినీ లెదర్ పార్క్ మంజూరు చేసింది. పార్క్‌లో ఉపాధి కల్పిస్తామని చెప్పి నాతో పాటు చాలా మందికి లిడ్‌క్యాప్ ఆధ్వర్యంలో చెప్పులు, బూట్లు, బ్యాగుల తయారీపై చెన్నైలో ట్రైనింగ్ ఇప్పించారు. ఇది జరిగి ఏండ్లు గడిచినా..మెగా, మినీ లెదర్‌పార్కు ఏర్పాటుకాలేదు. తెలంగాణ వచ్చాక మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. లెదర్‌పార్కులను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
దీంతో నాతో సహా శిక్షణ పొందినోళ్లంతా సంబురపడ్డారు. కానీ, ఇప్పటికీ లెదర్ పార్క్‌ల అభివృద్ధి కోసం ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో ఎప్పటిలెక్కనే ఇప్పుడు కూడా రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటున్నాను'...
- ఇరుగు రామస్వామి, ఖమ్మం
స్టేషన్ ఘన్‌పూర్‌లో మెగా లెదర్ పార్క్ ఏర్పాటు చేస్తం. ఇందుకోసం117 ఎకరాల స్థలం సేకరించినం. సుమారు 270 కోట్ల పెట్టుబడులు అవసరముంటరు. ఇందులో కేంద్రం నుంచి రూ.105 కోట్లను ఆశిస్తూ డీపీఆర్ సబ్మిట్చేసినం. గతంలో రాష్ట్రంలో 9 మినీ లెదర్ పార్క్ లు ఏర్పాటు చేస్తే అవి ఆశించినంత ఉపయోగపడలే. కొత్తగా నిర్మించే మెగా లెదర్ పార్క్ కు ఈ 9 మినీ పార్క్ లను లింక్ చేస్తం. మెగా లెదర్ పార్క్ ఏర్పాటుతో 20 వేల మందికి ఉపాధి వస్తది. రాబోయే రెండేళ్లలో వీటన్నింటినీ వినియోగంలోకి తెస్తం'
2016 అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మంత్రి కేటీఆర్