Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షం
- వచ్చే మూడ్రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ప్రధాన అధికారి కె.నాగరత్న రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలనీ, పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మంగళవారం నాడు రాష్ట్రంలో 850కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. 25 ప్రాంతాంల్లో అత్యంత భారీ వర్షం కురిసింది. 132 ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కొమ్రంభీమ్ అసిఫాబాద్ జిల్లా జైనూర్లో అత్యధికంగా 21.65 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, ములుగు, మంచిర్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలు చోట్ల అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. ఒడిశా తీరం, పరిసర ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. సముద్ర మట్టం నుంచి 3.1 - 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉత్తర ద్వీపకల్ప భారతదేశం అంతటా ఉపరితల ఆవర్తనం నెలకొంది. అది ఎత్తుకు వెళ్లే కొద్దీ వంపు తిరిగి ఉన్నది. రుతుపవన ద్రోణి జైసల్మీర్, కోట, మాండ్ల, రాయిపూర్, ఝూర్సిగూడ మీదుగా తూరు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు ఎక్కువ ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు, పలు జిల్లాల్లో భారీ నుంచి అతి, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశముంది.