Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్షలాది మంది ఉపాధిని కాపాడాలి
- ప్రొఫెసర్ కోదండరాం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్లో ప్రకటనల పరిశ్రమలో గుత్తాధిపత్యం తగదని టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. మంగళవారం హైదరాబాద్లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్లో దాదాపు 500 వరకు అడ్వర్టైజింగ్ కంపెనీలున్నాయని తెలిపారు. పెయింటింగ్ మొదలుకుని కంప్యూటర్ డిజైన్ కంపోజింగ్ వరకు ఈ రంగంలో లక్ష నుంచి రెండు లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారని చెప్పారు. అయితే టీఆర్ఎస్ సర్కారు 2020 ఏప్రిల్లో తీసుకొచ్చిన జీవో 68 తో హైదరాబాద్లో 15 అడుగులకు మించి బోర్డులు ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ ఉత్తర్వులిచ్చిందని గుర్తుచేశారు. దీంతో జీహెచ్ఎంసీకి రూ.60 నుంచి రూ.70 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. తాజాగా ప్రకటనలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో విధించిన నిబంధనలతో కేవలం మూడు, నాలుగు కంపెనీలే అర్హత పొందేలా ఉన్నాయనీ, దీంతో వందలాది కంపెనీలపై ఆధారపడ్డ వారి జీవితం రోడ్డుపాలయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా 6,000 బోర్డులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించి తొలిదశలో 1,500 బోర్డుల ఏర్పాటుకు టెండర్లు పిలిచారని వివరించారు.
గతంలో బస్ షెల్టర్లు, టాయిలెట్ల నిర్మాణ అనుభవం ఉన్నవారికే అర్హత ఉందనే విధంగా సవరించిన దాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాని స్థానంలో బోర్డుల ఏర్పాటు అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. నగరం అందరిదనీ, అందరికీ అవకాశాలుండాలని కోదండరాం సూచించారు.
కేసీఆర్ నోట...ప్రజాస్వామ్యం మాటనా..?
నిరంకుశంగా పాలన చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ వ్యాఖ్యానించడంపై కోదండరాం విమర్శలు గుప్పించారు. నిత్యం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తూ, భావప్రకటనా స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. పాలకులు మారితే సరిపోదనీ, వారి పాలన మారాలన్నారు. అందుకోసం ప్రజా ఉద్యమాలు నిర్మించాలని అభిప్రాయపడ్డారు. పోడు రైతులు, ప్రకటనల రంగం సమస్యలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో టీజేఎస్ ప్రధాన కార్యదర్శి భైరీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.