Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ సభ్యులు ఎన్ శ్రీకుమార్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
విద్యుత్ పంపిణీ సంస్థల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాల తీవ్రత పెరుగుతున్నదని ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ సభ్యులు ఎన్ శ్రీకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా విద్యుత్ ప్రమాదాల వల్ల మనుషులు, మూగజీవాలతో పాటు ఆస్తినష్టాలు కూడా భారీగా సంభవిస్తున్నాయని చెప్పారు. ప్రయాస్ గ్రూప్ ఆధ్వర్యంలో మంగళవారం 'విద్యుత్ భద్రత-విషాదాల వెనుక ప్రభుత్వ అంతరం' అంశంపై జరిగిన వెబ్నార్లో ఆయన మాట్లాడారు. 2015 నుంచి 2020 వరకు దేశవ్యాప్తంగా విద్యుత్ మరణాల సంఖ్య పెరుగుతూ వస్తున్నదని చెప్పారు. వాస్తవానికి సాంకేతికత పెరిగే కొద్దీ విద్యుత్ ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గాలనీ, కానీ అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయన్నారు. సాంకేతికత వినియోగంలో ఎప్పటికప్పుడు సిబ్బందికి శిక్షణ ఇవ్వడంలో విద్యుత్ పంపిణీ సంస్థలు శ్రద్ధ చూపట్లేదన్నారు. పారిశ్రామికంగా కూడా పూర్తి స్థాయి నైపుణ్యం లేకుండానే విధుల్లోకి తీసుకుంటున్నారనీ, విద్యుత్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన కనీస చర్యలు కూడా ఉండట్లేదన్నారు. ఈ ప్రమాదాలు, మరణాలకు మధ్య ప్రభుత్వ అంతరం ఉన్నదని స్పష్టం చేశారు. ప్రమాదాల నివారణకు డిస్కంలకు ప్రత్యేక నిధి ఉన్నదనీ, కానీ దాన్ని సమర్థవంతంగా, పూర్తిస్థాయిలో ఖర్చు చేయట్లేదని అభిప్రాయపడ్డారు. విద్యుత్ భద్రతా సవాళ్లను స్వీకరించడానికి పంపిణీ సంస్థలు సిద్ధంగా ఉండాలని, ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ, తగిన ఆదేశాలు జారీ చేస్తే తప్ప పరిస్థితుల్లో మార్పు రాబోదని తెలిపారు. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లో కేవలం 11 రాష్ట్రాల్లోనే విద్యుత్ ప్రమాదాల నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారని ఉదహరించారు. ఈ ప్రమాదాల వల్ల డిస్కంల ప్రతిష్టతో పాటు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందనీ, తమ విధానాలను వారు తప్పక మార్చుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. అనంతరం పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు.