Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన ఎన్ఐఆర్డీపీఆర్ అదనపు కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలోని గ్రామ పంచాయతీలలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకుగానూ గ్రామాల్లో చైతన్యపరిచే ట్రైనర్లకు మంగళవారం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో గల జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శిక్షణా సంస్థలో ఎన్ఐఆర్డీపీఆర్ అదనపు కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ కుమార్ శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..క్షేత్రస్థాయిలో 9 అంశాలలో 388 కొలమానాలు పెట్టుకుని 168 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా ఎన్ఐఆర్డీపీఆర్ కృషి చేస్తున్నదని ఆయన చెప్పారు. దేశంలో 2.54 లక్షల గ్రామ పంచాయతీల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి అంశంపైనా 200 మంది రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తామన్నారు. 40 బ్యాచ్లలో 50 మందికి చొప్పున శిక్షణ ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి అనే థీమ్పై మొదటి బ్యాచ్ శిక్షణ మూడు రోజుల పాటు కొనసాగుతుందనీ, ఇందులో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన 34 మంది పాల్గొంటున్నారని తెలిపారు. సీపీఆర్డీపీ అండ్ ఎస్ఎస్డీ, ఎన్ఐఆర్డీపీఆర్ విభాగాధిపతి డాక్టర్ అంజన్ కుమార్ భంజా మాట్లాడుతూ..గ్రామపంచాయతీ డవలప్మెంట్ ప్రోగ్రామ్ నేపథ్యాన్ని వివరించారు. ఎఐఆర్డీపీఆర్ ఐసీఏఎస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శశిభూషణ్ మాట్లాడుతూ..లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ డిప్లమా కోర్సు యొక్క మార్గదర్శకాలు, నిర్దేశాలను వివరించారు. స్థానికసంస్థలు గ్రహించిన సమస్యల ప్రాధాన్యత, సందర్భోచిత పరిష్కారాల ఆలోచన, నిధులను మెరుగైన పద్ధతిలో వాడుకోవడం వంటి వాటి గురించి చెప్పారు.