Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గురువారం నుంచి జరిగే ఎంసెట్ రాతపరీక్షలను వాయిదా వేయాలని భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ నగరంతో సహా పలు పట్టణాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో గ్రామీణాప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వచ్చి పరీక్షలు రాయాలంటే విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఉన్నత విద్యామండలి కుదుర్చుకున్న కన్సల్టెన్సీ కోసమే పరీక్షలు ముందు ప్రకటించిన తేదీల్లో నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. ఉన్నతవిద్యామండలి చైర్మెన్, అధికారులు హైదరాబాద్‌లో కూర్చొని పరీక్షలు నిర్వహిస్తామంటున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో విద్యార్ధులు, తల్లిదండ్రుల ఇబ్బందులను ఆలోంచించడం లేదని విమర్శించారు. కనీసం బస్సు ఇతర రవాణా సౌకర్యం లేని ప్రాంతాలున్నాయనీ, అలాంటి ప్రాంతాల నుంచి విద్యార్థులు పరీక్షలు రాయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. విశ్వవిద్యాలయాలు సైతం తమ పరీక్షలు వాయిదా వేసుకుంటే ఎంసెట్‌ను కచ్చితంగా జరపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ పరీక్షను మరొక తేదీలో నిర్వహించాలని కోరారు.