Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు రేవంత్రెడ్డి బహిరంగ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గతవారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వానలకు రాష్ట్రంలో పంటలు నీట మునిగాయనీ, రైతులకు అపార నష్టం వాటిల్లిందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం సీఎం కేసీఆర్కు ఆయన బహిరంగ లేఖ రాశారు. పంట నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తూ వారి బతుకులతో చెలగాటడుతున్నారు. పంట నష్టంపై ప్రభుత్వంగానీ, వ్యవసాయ శాఖ ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్,వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాది కొత్తగూడెం జిల్లాల్లో ఐదు లక్షల ఎకరాలకుపైగా పంటలు నీటిమునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చోట్ల విత్తనాలు మొలకెత్తకుండా వర్షాల వల్ల మురిగిపోతున్నాయని తెలిపారు. వానలకు వరి విత్తనాలు మురిగిపోయి మొలకలు రావడంతో ఫలితంగా మళ్లీ విత్తనాలు వేస్తే, నారు పోసుకుని నాట్లు వేయాల్సి పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. 2015 నుంచి పంట నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం మానేసిందని విమర్శించారు. పంట నష్టాన్ని సైతం అంచనా వేయడం లేదని తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంపీబీవైై) నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుందని ఆరోపించారు. ప్రభుత్వాల చేయూత లేకుండా రైతులు స్వయంగా పంటల బీమా తీసుకునే పరిస్థితి లేకపోవటంతో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు భారీ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్లో నష్ట పోయిన రైతులకు భరోసా కల్పించేలా తగిన నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కొత్తగా పంటలు వేసుకునేందుకు విత్తనాలు, ఎరువులు, ఇన్ఫుడ్ సబ్సిడీ ఇవ్వాలని కోరారు. తదుపరి పంటల నుంచి ప్రభుత్వం ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకాల అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.