Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేఆర్ఎంబీకి ఈఎన్సీ ఘాటు లేఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ గవర్నమెంట్‌పై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆర్డీఎస్(రాజోలి బండ డైవర్షన్ స్కీమ్) కుడి కాల్వ పనులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ కేఆర్ఎంబీ చైర్మెన్‌కు ఘాటు లేఖ రాశారు. కేఆర్ఎంబీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు కొనసాగిస్తున్నారని లేఖలో విమర్శించారు. ఆర్డీఎస్ కుడి కాల్వ పనులు కొనసాగించకుండా ఏపీని నిలువరించాలని డిమాండ్ చేశాఉ. ఎలాంటి అనుమతులు లేకున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం పనులు కొనసాగిస్తున్నదని కేఆర్ఎంబీకీ లేఖ ద్వారా పూర్తి వివరాలను తెలియజేశారు.
కేఆర్ఎంబీ ఆదేశాలను ఏపీ బేఖాతర్
కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశాలను ఏపీ ప్రభుత్వం బేఖాతర్ చేస్తున్నది. బ్రిజేశ్‌కుమార్ తీర్పును అనుసరిస్తూ తుంగభద్ర నదిపై నిజాం కాలంలో కర్ణాటకలో నిర్మించిన రాజోళీ బండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్ ఆనకట్ట) నుంచి అక్రమంగా కాల్వను తవ్వి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం గతేడాది జూన్‌లో చర్యలు చేపట్టింది. కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల అనుమతులు లేకుండా ఆర్డీఎస్ కుడి వైపు పనులను వేగంగా పూర్తి చేసింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కష్ణానది నుంచి ఏపీకి నాలుగు టీఎంసీల నీటిని కేటాయించింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు సరిగ్గా చేయలేదంటూ ఆ తీర్పును నిలిపివేయాలని తెలంగాణ జలవనరుల శాఖ అధికారులు గతంలోనే కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక ఆర్డీఎస్ కుడివైపు కెనాల్ పనులు చేపట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని అప్పట్లోనే తెలంగాణ సర్కారు కోరంది. దీంతో కొంతకాలం పను లు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం, గుట్టుచప్పుడు కాకుండా స్ట్రక్చర్ నిర్మాణం పనులు పూర్తి చేసి గేట్లు అమర్చేందుకు ఇప్పుడు కసరత్తు చేస్తుండటం గమనార్హం.
రూ.1,985 కోట్లతో పనులు
ఏపీ ప్రభుత్వం రూ.1,985.423 కోట్ల వ్యయంతో కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట కుడి కాల్వ పనులకు గత ఏడాది శ్రీకారం చుట్టింది. నాలుగు టీఎంసీల నీటిని తరలించేందుకు కాల్వను తవ్వి గ్రావిటీ ద్వారా 40 వేల ఎకరాల ఆయకట్టుతోపాటు నాలుగు లిఫ్టులను సైతం ఏర్పాటు చేసి మరో ఐదు లక్షల ఎకరాల ఆయకట్టుకు అక్రమంగా నీటిని తరలించే ప్రయత్నాలు చేస్తున్నది. కర్నూల్ జిల్లాలోని రైతులకు సాగు, తాగునీటిని అందించేందుకుగాను ఏపీ సర్కార్ కుడివైపు కాల్వ పనులు చేపట్టింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును అడ్డం పెట్టుకొని తుంగభద్ర నది నుంచి నీటిని అక్రమంగా తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదనే ఆరోపణలు ఇదివరకే వచ్చాయి. కొత్త ప్రాజెక్టు లు నిర్మిస్తే కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వంతోపాటు నదినీటి హక్కులు కలిగిన రాష్ట్రాల అనుమతులు సైతం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కుడివైపు కాల్వ నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా చేపట్టగా పనులు తుది దశకు చేరాయి.
అలంపూర్ ఆయకట్టుకు నీటి కటకట..
ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద కుడివైపు చేపట్టిన కాల్వ నిర్మాణంతో తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీటికి కటకట ఏర్పడనున్నది. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి గ్రావిటీ ద్వారా ఏపీ ప్రభుత్వం సులభంగా నీటిని తరలించేందుకు అవకాశం ఎక్కువగా ఉండటంతో ఎడమ కాల్వ ద్వారా రాష్ట్రానికి నీటి రాక తగ్గుతుందని రైతులతోపాటు సాగునీటిరంగ నిపుణులూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, ఏనాడు 35 వేల ఎకరాలకు మించి సాగునీరు అందిన దాఖలాలు లేవని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారే అవకాశాలు ఉన్నాయని రైతులు వాపోతున్నారు. ఆర్డీఎస్ కుడివైపు కాల్వ నిర్మాణంతో తుంగభద్ర నది పరీవాహక ప్రాంతంలో వంద గ్రామాలు తాగునీటికి, ఆర్డీఎస్ ఆయకట్టు 87,500 ఎకరాలు, నదితీర ప్రాంత ఆయకట్టు దాదాపు నాలుగు లక్షల ఎకరాలు బీడుగా మారే ప్రమాదం ఉన్నదని రైతులు చెబుతున్నారు.