Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ పరిశీలనకు రవాణాశాఖ ప్రతిపాదనలు
- రద్దయితే 3.5లక్షల మంది వాహనదారులకు ఊరట
- ఇవ్వాలో.. రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
వాహనదారులకు గుదిబండగా మారిన వాహన ఫిట్నెస్ లేట్ ఫీజును ప్రభుత్వం రద్దు చేసే దిశగా యోచిస్తోంది. ఆలస్యం పేరుతో రోజుకు రూ.50 పెంపు నిబంధనతో ప్రస్తుతం ఒక్కో వాహనానికి రూ.40 వేల నుంచి లక్షన్నరకుపైగా భారం పడుతోంది. ట్రాన్స్‌పోర్టు రంగం, దానిపై ఆధారపడిన డ్రైవర్లు, కార్మికులు, యజమానులను తీవ్ర ప్రభావితం చేస్తుండటంతో లేట్ ఫిట్నెస్ జరిమానాలను రద్దు చేయాలనే నిర్ణయానికి సర్కారు వచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రవాణాశాఖ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది. అయితే గడిచిన అయిదారు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సీఎంతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు వరుస సమీక్షల్లో బిజీగా గడుపుతుండటంతో ఈ నిర్ణయం కాస్త ఆలస్యమవుతోంది. నేడో..రేపో ప్రభుత్వం నుంచి ఓ సానుకూల నిర్ణయం రావొచ్చునని రవాణాశాఖ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఈ నిర్ణయంతో దాదాపు గ్రేటర్‌తోపాటు రాష్ట్రంలో 3.2లక్షల మంది డ్రైవర్లు, యాజమానులకు ఊరట కలగనుంది.
కరోనా వైరస్ నేపథ్యంలో దాదాపు రెండేండ్లకుపైగా కమర్షియల్ వెహికల్స్ అయిన ఆటోలు, క్యాబ్‌లు, ట్రాలీలు, గూడ్స్ వాహనాలు, డీసీఎంలు, లారీలు, ఇతర వాణిజ్య వాహనాలు రోడ్లపైకి రాలేదు. దాదాపు అన్ని వాహనాలు ఇండ్లకే పరిమితమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ వాహనాలు దాదాపు 29.5లక్షలకుపైనే ఉంటాయి. కేంద్రం సవరించిన నూతన మోటారు వాహనాల చట్టం ప్రకారం గడువులోగా ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రం పొందని పక్షంలో రోజుకు రూ.50 చొప్పున జరిమానా వసూలు చేయాలని నిర్దేశించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తెలంగాణ ప్రభుత్వం దీనిని అమలులోకి తీసుకువచ్చింది. దీంతో ఏప్రిల్ ఒకటి తర్వాత ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం వచ్చే వాహనాలకు వ్యాలిడిటి అయిన దగ్గర నుంచి లెక్కగట్టి రోజుకు రూ.50 చొప్పున అధికారులు జరిమానా విధిస్తున్నారు. ఫలితంగా ఫిట్‌నెస్‌కు వచ్చే వాహనాలకు రూ.40వేల నుంచి లక్షన్నర వరకు జరిమానా వస్తోంది. దీంతో ఏప్రిల్ నుంచి ఆర్టీఏ కార్యాలయాల్లో ఫిట్నెస్ కోసం వచ్చే వాహనాలు పూర్తిగా తగ్గిపోయాయి.
రాష్ట్రవ్యాప్తంగా నెలకు 30 వేల నుంచి 80వేలకుపైనే ఫిట్నెస్ పరీక్షలు జరుగుతుండగా.. రూ.50 రుసుము దెబ్బకు సగానికి తగ్గిపోయినట్టు ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. అంతేగాక, దీని ప్రభావం రాష్ట్రంలోని స్కూల్ బస్సులపై పడింది. స్కూళ్లు ప్రారంభం నేపథ్యంలో బడి బస్సు రెన్యూవల్‌కు వెళ్తే.. రెండేండ్లకు కలిపి దాదాపు 38వేల ఫెనాల్టీ రావడంతో సగానికిపైగా బస్సులు నేటికీ ఫిట్‌నెస్‌కు దూరంగా ఉండిపోయాయి. ఇదిలావుంటే కాలం చెల్లిన వాహనాలను తుక్కు కింద మార్చాలంటే కూడా ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. రవాణాశాఖ అనుమతి తీసుకోవాల్సిందే. దీనికి కూడా వేలు, లక్షల్లో జరిమానాలు చెల్లించాల్సిన దుస్థితి.
ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు
ఇంత పెద్దమొత్తంలో ఫెనాల్టీలు విధిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ట్రాన్స్‌పోర్టు రంగానికి చెందిన సంఘాలు నాయకులు, కార్మికులు ఆందోళన బాట పట్టారు. కార్మిక సంఘాల నాయకులు, డ్రైవర్లు, యజమానుల ఆందోళనల నేపథ్యంలో రవాణాశాఖ ఉన్నతాధికారులు పక్క రాష్ట్రాల్లో అమలవుతున్న తీరును పరిశీలించి ఓ నివేదికను ప్రభుత్వానికి పంపించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఫెనాల్టీలూ లేకుండానే ప్రతిపాదనలు రూపొందించాలని రవాణా అధికారులను సూచించడంతో అధికారులు మరో నివేదికను పంపించారు. ప్రస్తుతం ఈ ఫైల్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే గ్రేటర్‌తోపాటు రాష్ట్రంలోని 3.5లక్షల మంది డ్రైవర్లు, యజమానులకు లబ్ది జరగనుంది.