Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25 నుంచి రాష్ట్ర కమిటీ సమావేశాలు: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఐక్యపోరాటాలతోనే ప్రజాసమస్యలు పరిష్కారమవుతాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు స్పష్టం చేశారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్లో జరిగే ఉద్యమాలకు ఈనెల 25 నుంచి 27 వరకు హనుమకొండలో నిర్వహించనున్న పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో కార్యాచరణను రూపొందించనున్నట్టు తెలిపారు. హనుమకొండ ఎన్జీఓస్ కాలనీలోని కళ్యాణి ఫంక్షన్ హాల్లో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సారంపల్లి వాసుదేవరెడ్డి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి సుదర్శన్రావు హాజరై మాట్లాడారు. కార్మిక రంగం, వ్యవసాయ కార్మికులు, విద్య ఉపాధి రంగాలపై సమావేశాల్లో చర్చించనున్నట్టు తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 44 చట్టాలను రద్దు చేసి కార్మికుల వ్యతిరేక లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని, స్థలం ఉన్న వారికి రూ.3 లక్షలు ఇస్తామంటూ మోసగిస్తోందని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజాసమస్యలపై పోరాడేది ఎర్రజెండా మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా 26న తలపెట్టిన బహిరంగసభకు పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ లెఫ్ట్ ఫ్రంట్ చైర్మెన్ విజయ రాఘవన్, పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి, జిల్లా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.