Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పండుగ తెల్లారే విషాదం
- ముఖ్యమంత్రి విచారం..
- మృతులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల సాయం
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఎడతెరపిలేని వర్షాలతో విద్యుత్తు వైర్ తెగి ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులతో పాటు తల్లిదండ్రులను బలి తీసుకుంది. అమ్మమ్మ ఇంట్లో బక్రీద్ పండుగ చేసుకుని సంబురంగా ఇంటికి వచ్చిన ఇంటిల్లిపాదిని విద్యుద్ఘాతం పొట్టనపెట్టుకుంది. ప్రస్తుతం ఆ కుటుంబంలో ఒకే బాలుడు మిగిలాడు. తల్లిదండ్రులు, తోబట్టువులను కోల్పోయి అనాథగా మారాడు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆటో డ్రైవర్‌గా పని చేసే హైమద్(35) కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్స్ కాలనీలో చిన్న ఇల్లు కట్టుకొని తన కుటుంబంతో కొన్నేండ్తుగా నివాసముంటున్నారు. హైమద్కు భార్య పర్వీన్ (30), పిల్లలు అద్నాన్ (4), మాహిమ్ (6) ఉన్నారు. స్కూళ్లకు సెలవులు ఇవ్వడం, బక్రీద్ పండుగ ఉండటంతో పిల్లలు అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం బీడీ వర్కర్స్ కాలనీలోని తమ ఇంటికి వచ్చారు. ఇంటి బయట జేవైర్పై బట్టలు ఆరవేశారు. బట్టలు తీయబోతుండగా.. జేవైర్ ఊడి ఫేజ్వైర్కు తగిలింది. దాంతో జేవైర్లో విద్యుత్తు ప్రవాహం జరిగింది. మొదట మహిమ్ దానికి తగలడంతో ఆమె విద్యుతుఘాతానికి గురైయ్యింది. మహీమ్ను అద్నాన్.. అద్నాన్‌ను తల్లిదండ్రులు కాపాడబోయి పట్టుకోవడంతో అందరికీ కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు విద్యత్తు అధికారులకు సమాచారం ఇవ్వడంతో కరెంటు సరఫరా నిలిపేశారు. మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్ధిక సహాయం ప్రకటించారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్షేత్ర స్థాయిలో అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు చెప్పారు.