Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ల చేతుల్లోకి అడవులు: సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్
నవతెలంగాణ - ఆత్మకూరు
కొత్త అటవీ చట్టాన్ని వ్యతిరేకించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్ పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) జిల్లా స్థాయి శిక్షణా తరగతుల్లో మంగళవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో వెంకట్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కొత్త అటవీ చట్టాన్ని తీసుకొస్తోందని, దీన్ని అందరూ వ్యతిరేకించాలని కోరారు. గత అటవీ చట్టాలను సవరణ పేరుతో కొత్త చట్టాలు చేస్తున్నారని చెప్పారు. అడవి అనేది జాతీయ సంపద అని, అటవితో ప్రభుత్వాలకు పెద్దఎత్తున ఆదాయం వస్తుందని అన్నారు. అటువంటి అడవులు కొత్త చట్టాల వల్ల కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. కొత్త చట్టాలను తీసుకురావడాన్ని సీపీఐ(ఎం) వ్యతిరేకిస్తుందని చెప్పారు. అదేవిధంగా అటవీ చట్టం అమలు, ఆదివాసీ హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. అటవీ ప్రాంతంలో గిరిజనులపై దాడులు అమానుషమని తెలిపారు. పోలీసులు, ఫారెస్టు అధికారుల దాడుల ఆపాలని, కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఆర్మీలో అగ్నిపథ్‌తో కాంట్రాక్ట్ వ్యవస్థ వల్ల దేశ భద్రత ప్రమాదంలో పడుతుందన్నారు. ఈ స్కీమ్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మన దేశం కూడా మరో శ్రీలంకలా కాకుండా, ధరలను నియంత్రించాలన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ మాట్లాడుతూ.. నిరుద్యోగాన్ని నియంత్రించాలని, రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. నల్లమలలో మైనింగ్‌ను వ్యతిరేకిస్తున్నామన్నారు.
కొత్త అటవీ చట్టం వల్ల అడవి మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్తుందని, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి హక్కులూ లేకుండాపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి కొత్త అటవీ చట్టాన్ని వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం.డి జబ్బర్, జిల్లా కార్యవర్గ సభ్యులు పుట్ట ఆంజనేయులు, జిఎస్ గోపి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.