Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటేషన్ ముగిసినప్పటికీ ఏడీ తిష్ట
- సిబ్బందిలో అయోమయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డిప్యూటేషన్ అంటే కొద్ది కాలం కోసం ఒక చోట పని చేసే వారిని మరో చోటికి పంపించడం. వారికి నిర్దేశించిన పని పూర్తి కాగానే మాతృసంస్థకు లేదా వేరే చోట పోస్టింగ్ ఇస్తుంటారు. బదిలీ చేస్తుంటారు. అయితే ఆ సొసైటీలో డిప్యూటేషన్ కాల పరిమితి అయిపోతున్న కదల కుండా అక్కడే ఉంటుండటం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(టి శాక్స్)లో 'అడిషనల్ డైరక్టర్ అధికారి' పోస్టు వివాదాలకు దారి తీస్తోంది. డిప్యూటేషన్ కాల పరిమితి ముగిసినప్పటికీ ఇంకా అదే 'కుర్చీ'లో కొనసాగడం, మరో వైపు ఉన్నతాధికారులు ఆ పోస్ట్ బాధ్యతలను ఇతరులకు అప్పగించక పోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. జూన్ చివరి వారంతో డిప్యూటేషన్ కాలం ముగియడంతో తిరిగి ఆ పోస్ట్ విషయంలో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో టిశాక్స్ సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు. ''ఫారీన్ సర్వీస్ పేరుతో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో డిప్యూటేషన్ పద్ధతిలో ఏకంగా అడిషనల్ డైరక్టర్ పోస్ట్ ఇవ్వడం పట్ల సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది జూన్ చివరి వారంలోనే డిప్యూటేషన్ గడువు ముగిసింది. దీంతో టీశాక్స్ ఉన్నతాధికారులు మరో ఏడాది పాటు పదవీకాలాన్ని పొడిగించారు . ఈ గడువు కాలం కూడా ఇటీవల ముగిసింది. దీంతో సదరు అధికారికి చెందిన డిప్యూటేషన్ గడువును పొడిగిస్తారా?, లేదా, ఇతర అధికారులకు బాధ్యతలు అప్పగిస్తారా? అనేది టీశాక్స్‌లో ఆసక్తిగా మారింది. అర్హత లేకపోయినా డిప్యూటేషన్ పద్దతిలో అడిషనల్ డైరక్టర్ పదవిలో కొనసాగడంపైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కూడా ఆరా తీసినట్టు తెలిసింది. పైగా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీపై పూర్తి స్థాయిలో అవగాహనలేని వారికి పోస్టింగ్ ఇవ్వడంతో వివిధ ప్రభుత్వ ప్రాజెక్ట్ అమలు తీరులో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనీ, ''ఎయిడ్స్ కంట్రోల్ '' లక్ష్యం నీరుగారుతోందని పలువురు చెబుతున్నారు. ఇది వరకు ఎయిడ్స్ బాధితుల భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలు జరిగే టీ శాక్స్ గత కొంతకాలంగా బాధితుల భాగస్వామ్యం తగ్గిందనీ, కొన్ని స్వచ్ఛంద సంస్థ (ఎన్జివో) అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అడిషనల్ డైరక్టర్ పదవికి అర్హులైన వారు, టిశాక్స్పై అవగాహన ఉన్న అధికారులకు బాధ్యతలు ఇవ్వడం లేదని పలువురు చెబుతున్నారు. కాగా డిప్యూటేషన్ కొనసాగించేం దుకు సదరు అధికారి తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, నిబంధనలకు విరుద్ధంగా కొందరు అధికారులు డిప్యూటేషన్ పొడిగించేందుకు ప్రయత్నిస్తున్నట్టు టీశాక్ వర్గాలు చెబుతున్నాయి. అర్హులైన అధికారులకు బాధ్యతలను అప్పగిస్తే టిశాక్స్ ప్రాజెక్ట్‌తో మెరుగైన ఫలితాలు వస్తాయని పలువురు చెబుతున్నారు. అయితే ఈ పోస్ట్ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ స్పందన ఎలా ఉండబోతుందనేది టీశాక్ చర్చనీయంశంగా మారింది.