Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మంలో బస్టాండ్ మొదలు 'డబుల్' ఇండ్లు, కార్పొరేషన్ వరకూ..
- పట్టుమని రెండేండ్లు కాకముందే కురుస్తున్న భవనాలు
- నెర్రలుబారి.. చెమ్మదిగి లీకవుతున్న వైనం
- రూ.వందల కోట్ల విలువైన నాసిరకం నిర్మాణాలపై విచారణ చేయాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వం నిర్మిస్తున్న నిర్మాణాల డొల్లతనం నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లీకుల రూపంలో బయటపడుతోంది. ఏడాది కిందట ప్రారంభించిన నూతన బస్టాండ్ మొదలు డబుల్‌బెడ్‌రూమ్‌ల వరకూ.. పట్టుమని నెల కూడా కాకముందే ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయం స్లాబ్‌లు లీకై నీరు బకెట్లతో ఎత్తిపోయాల్సిన దుస్థితి ఏర్పడింది. మంత్రి అజరు ఇలాకాలో రూ.వందల కోట్లతో నిర్మించిన భవనాలు కొద్దిరోజులకే ఇలా కురుస్తుండటంపై విచారణ జరిపించాలని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది.
రూ.22కోట్లతో నిర్మిస్తే నీళ్లెత్తి పోయక తప్పట్లే...!
నైజాం కాలంలో వన్‌టౌన్ ప్రాంతంలో నిర్మించిన ఖమ్మం నగర పాలక సంస్థ (నాడు పురపాలక సంఘం) కార్యాలయ భవనం వందల ఏండ్లయినా నిర్మాణపరంగా ఎలాంటి లోపాలు తలెత్తిన దాఖలాలు లేవు. గట్టయ్య సెంటర్లో నూతనంగా రూ.22 కోట్ల వ్యయంతో నిర్మించిన కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించి రెండు నెలలు కూడా కాకముందే నీరెత్తిపోయాల్సిన దుస్థితి దాపురించింది. రూ.11 కోట్ల అంచనా విలువతో రాష్ట్రప్రభుత్వ నిధులతో నవంబర్ 13, 2016న మంత్రి కేటీఆర్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. గతనెల 11న కేటీఆర్ అధికారికంగా ప్రారంభించారు. అంచనా వ్యయం కన్నా నిర్మాణ వ్యయం డబుల్ అయినా పనుల్లో నాణ్యతా లోపాన్ని ఎత్తి చూపేలా లీకేజీలు ఏర్పడ్డాయి. గోడలు చెమ్మదిగి రెండో ఫ్లోర్లో స్లాబ్ నుంచి నీరు కారుతున్నది. సిబ్బంది బకెట్లు, డబ్బాలతో ఆ నీటిని బయటపోస్తున్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో మూడు అంతస్తులు ఉండగా సుమారు ఐదారు గదులు కురుస్తున్నాయి. మూడో అంతస్తులో ఉన్న సమావేశ మందిరం ఒకవైపు పూర్తిగా కురుస్తోంది. దానిలో ఏర్పాటు చేసిన కుర్చీలు నీటిలో నాని దెబ్బతింటున్నాయి. సెకండ్ ఫ్లోర్‌లోని టౌన్ ప్లానింగ్, గ్రౌండ్ ఫ్లోర్‌లోని వెయిటింగ్ హాల్, చివరకు మేయర్, ఆమె పీఏ గదులు, క్యాంటిన్, కొన్ని మూత్రశాలల్లోనూ ఇదే పరిస్థితి. వర్షం నీళ్లకు వైర్లు కాలిపోయి ఓ లిఫ్ట్ పనిచేయడం లేదు. మరో లిఫ్ట్‌ను తాకితే షాక్ కొడుతోంది. రెండు లిఫ్ట్‌లూ పనిచేయకపోవడంతో మూడో అంతస్తులోని తన చాంబర్‌కు మేయర్ పునుకొల్లు నీరజ మంగళవారం మెట్ల మీదుగా నడిచివెళ్లారు.
డబుల్ బెడ్రూంల్లోనూ లీకులు...
ఫిబ్రవరి 11, 2017న ఖమ్మం అర్బన్ మండలం టేకులపల్లిలో మూడు అంతస్తుల్లో 52 బ్లాకులుగా 1,244 కుటుంబాలు ఉండేలా 'డబుల్' పట్టణ గృహ నిర్మాణ పథకము (కేసీఆర్ నగర్)కు శంకుస్థాపన చేసి నిర్మాణం చేపట్టారు. మొదటి విడుతగా రూ.63.143 కోట్ల అంచనా విలువతో 560 చదరపు అడుగుల విస్తీర్ణంతో బ్లాక్‌కు 24 ప్లాట్లతో రెండు అంతస్తులతో కూడిన 42 బ్లాకులు నిర్మించారు. వాటిని గతేడాది ఏప్రిల్ 2న కేటీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత దాన్ని విస్తరిస్తూ మరో 244 ఇండ్లను అదనంగా చేర్చారు. వీటిని గత నెల 11న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఐదుగురు కాంట్రాక్టర్లు ఈ ఇండ్లను నిర్మించారు. ప్రారంభించిన ఓ ఐదారు నెలల తర్వాత లబ్దిదారులు గృహప్రవేశాలు చేశారు. ఒకటి, రెండు నెలల్లోనే నిర్మాణ లోపాలు బయటపడటంతో లబ్దిదారులు మంత్రులు కేటీఆర్, అజరుతో పాటు మాజీ ఎంపీ పొంగులేటికి ఫొటోలతో సహా ట్వీట్ చేశారు. ఆ తర్వాత కాంట్రాక్టర్లు పై అంతస్తు స్లాబ్లకు కొన్ని మరమ్మతులు చేసినా ఈ వర్షాలకు గోడల వెంట నీళ్లు లీకవుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పై అంతస్తులోని దాదాపు అన్ని ఇండ్లలో రెండు బెడ్రూంల్లో ఫ్లోర్ నీళ్లమయం కావడంతో ఉండే పరిస్థితి లేదు.
రూ.30 కోట్ల నూతన బస్టాండ్కూ చిల్లులు...!
రూ.25 కోట్ల అంచనా వ్యయంతో 2017 మే 15న శంకుస్థాపన చేసిన ఖమ్మం నూతన బస్టాండ్‌ను ఏప్రిల్ 2న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 7.33 ఎకరాల విస్తీర్ణంలో హైటెక్ హంగులతో 30 ప్లాట్‌ఫామ్‌లతో నిర్మించిన ఈ బస్టాండ్‌ను రాష్ట్రంలోనే రెండో అతిపెద్దదిగా అభివర్ణించారు. అంచనాకు మించి నిర్మాణ వ్యయం అయిందనే కారణంతో మరో రూ.5 కోట్లు అదనంగా కేటాయిం చారు. కానీ నెలరోజులు కూడా గడవకముందే ప్రస్తుతం కురిసిన వర్షాలకు బకెట్లతో నీటిని ఎత్తిపోయాల్సిన దుస్థితి ఏర్పడింది. గతంలో బస్టాండ్‌లోని నిర్మాణ లోపాలను చూపిస్తూ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్, నాయకులు వెంకన్నబాబు, నర్రా రమేష్‌లు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వారిపై కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్టీపీ జిల్లా నాయకులు కృష్ణమోహన్‌పైనా ఇదే విషయంలో కేసు పెట్టారు.
నాసిరకం నిర్మాణాలపై విచారణ చేయాలి...
రెండేండ్లలో ఖమ్మం నగరంలో నూతనంగా నిర్మించిన బస్టాండ్, డబుల్‌బెడ్‌రూమ్‌లు, నగరపాలక సంస్థ కార్యాలయాల కోసం రూ. వంద కోట్లకు పైగా వెచ్చించారు. కానీ ఏ ఒక్క నిర్మాణంలోనూ కనీస ప్రమాణాలు పాటించలేదని మొదటి నుంచి సీపీఐ(ఎం) చెబుతోంది. కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి, మంత్రి స్పందించలేదు. ఇప్పుడా డొల్లతనం బయటపడుతోంది. నాసిరకం నిర్మాణాలపై విచారణ జరిపించాలి.
- యర్రా శ్రీకాంత్, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు