Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17 మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలు సేకరణ
- గదిలో వెంట్రుకలు, దుప్పటి, గాజు ముక్కల స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
వివాహితపై లైంగికదాడి, కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన హైదరాబాద్ మారేడ్‌పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే దర్యాప్తు అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. లైంగికదాడి, కిడ్నాప్, హత్యాయత్నం, ఆయుధ నిరోధక చట్టం కింద ఆయనపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో 17 మంది సాక్షుల వాంగ్మూలాలు పోలీసులు సేకరించారు. సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించడంతో ఆయన సర్వీస్ రివాల్వర్, పోలీస్ యూనిఫాంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి ఇంట్లోకి నాగేశ్వర్రావు బలవంతంగా చొరబడ్డారని, బలవంతంగా ఇంటి తలుపులు తెరిచాడని, తన గన్‌తో బెదిరించి దంపతులను నాగేశ్వర్రావు కిడ్నాప్ చేశాడని ఆరోపణలున్నాయి. ఈ మేరకు బాధితురాలి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. బాధితురాలిపై అఘాయిత్యం జరిగిన గదిలో క్లూస్ టీమ్ క్షుణ్ణంగా పరిశీలించింది. గదిలో వెంట్రుకలు, దుప్పటి, గాజు ముక్కలను స్వాధీనం చేసుకుని వాటిని ఎఫ్ఎస్ఎల్కి పంపించినట్టు తెలుస్తోంది. బాధితురాలి ఇంటి సమీపంలో వున్న సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. ఇబ్రహీంపట్నం మార్గంలో నాగేశ్వర్రావు కారు వెళ్లినట్టు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయింది. ఇప్పటికే ఆ కారును, బాధితురాలి సెల్‌ఫోన్ సీజ్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడి పోలీసులకు తాను అక్టోపస్ అధికారినని చెప్పాడని తేలింది. ప్రమాదానికి గురైన కారును అతని వద్ద పనిచేసే హోంగార్డు ద్వారా చంపాపేట్‌కు తరలించాడు. ఈ మేరకు పోలీసులు హోంగార్డు ప్రవీణ్ స్టేట్మెంట్ను సైతం రికార్డు చేశారు. ఘటన తర్వాత కూడా నాగేశ్వర్రావు మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విధులు నిర్వహించినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకుని మారేడ్‌పల్లి పోలీస ్స్టేషన్లోనే రివాల్వర్ ఉంచి నాగేశ్వర్రావు బెంగళూర్‌కు పారిపోయాడని దర్యాప్తులో వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపడంతో ఈ నెల 10న నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు హయత్‌నగర్ కోర్టులో హాజరుపర్చారు. అక్కడి నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు.