Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేకపోతే ఆందోళన : టీడబ్ల్యూజేఎఫ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలోని జర్నలిస్టులకు 2019 సంవత్సరంలో ఇచ్చినట్టుగా ఈ సారీ అక్రిడిటేషన్లు జారీచేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ప్రతి రెండేండ్లకోసారి ఇచ్చే అక్రిడిటేషన్ల ప్రక్రియ ఈ మారు కొంత ఆలస్యమైందనీ, అయినా జిల్లాల్లో డీపీఆర్వోలు జర్నలిస్టులను సతాయిస్తున్నారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య చెప్పారు. రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ 2019లో ఇచ్చినట్టు అక్రిడిటేషన్లు జారీచేయాలని చెప్పినా, ఆలా చేయకుండా ఆయా జిల్లాల డీపీఆర్వోలు కలెక్టర్లను తప్పుదోవపట్టిస్తూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నియమించిన అక్రిడిటేషన్ కమిటీలను సైతం డీపీఆర్వోలు ఖాతరు చేయడం లేదని విమర్శించారు. కరోనా కాలంలో జర్నలిస్టులు తమ వృత్తి నిర్వహణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సమాజానికి, ప్రభుత్వానికి సేవలు అందించిన సంగతి మరిచిపోయారా ? అంటూ ప్రశ్నించారు. అలాంటి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల జారీలో ఇష్టానుసారం వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. అంకితభావంతో వృత్తిని నిర్వహిస్తూ వందలాది మంది జర్నలిస్టులు చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
'జమీల్‌ను గుర్తించాలి'
వరదల్లో కొట్టుకుపోయిన జగిత్యాల జిల్లా ఎన్టీవీ రిపోర్టర్ జమీల్‌ను వెంటనే గుర్తించాలని ప్రభుత్వాన్ని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ కోరింది. జలదిగ్బందనంలో చిక్కుకున్న కూలీల వార్త కోసం కారులో వెళ్లి గల్లంతయ్యారనీ గుర్తు చేసింది. స్థానిక అధికారులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం జమీల్ జాడ కోసం తీవ్రంగా ప్రయత్నించాలని కోరింది. జమీల్ ప్రాణాలతో బయటపడాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొంది.