Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్ణీత కాలపరిమితి వరకే వర్తింపు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
వాహనాల ఫిట్నెస్ ఆలస్యం అయితే రోజుకు రూ.50 పెనాల్టీ విధిస్తూ కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిర్ణీత కాలపరిమితి వరకు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రవాణాశాఖ ప్రభుత్వ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు జీవో నెంబర్ 29 విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన మోటారు వాహన చట్టం ప్రకారం ఏదైనా వాహనం ఫిట్నెస్ ఆలస్యం అయితే రోజుకు రూ.50 పెనాల్టీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ వల్ల రవాణారంగం పూర్తిగా కుదేలైన స్థితిలో ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడాన్ని రవాణా కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై జేఏసీగా ఏర్పడి ఆందోళనలు చేపట్టాయి. ఎట్టకేలకు 2020 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 2021 అక్టోబర్ 31 వరకు కోవిడ్ కాలంలోని వాహనాలకు ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నట్టు జీవో నెంబర్ 29లో పేర్కొన్నారు. ఆ కాలన్ని ఫిట్నెస్ ఉన్నట్టుగా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.
పోరాటాల ఫలితమే-ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్
పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం ఫిట్నెస్ పెనాల్టీలను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యుఎఫ్) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ తెలిపారు. ఇది కార్మికులు సాధించిన పాక్షిక విజయమేననీ, మోటారు వాహన చట్టం-2019ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా జరిగే భవిష్యత్ ఉద్యమ కార్యాచరణలో కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.