Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో టెండర్ రద్దు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మన ఊరు-మన బడి కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నీచర్ కొనుగోళ్లకు ఇచ్చిన టెండర్‌ను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా బుధవారం మరో టెండర్‌ను కూడా రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. డెస్క్ కం టేబుల్, ఫర్నీచర్, టేబుల్స్ టెండర్‌ను గత సోమవారం రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన విషయం విదితమే. గ్రీన్ బోర్డుల సరఫరా టెండర్‌ను సవాలు చేసిన కేసును బుధవారం హైకోర్టు విచారణ ప్రారంభించగానే ప్రభుత్వం తరపు న్యాయవాది కల్పించుకుని గ్రీన్ బోర్డుల సప్లరు టెండర్‌ను కూడా రద్దు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. వీటన్నింటికీ మళ్లీ టెండర్లను పిలుస్తామన్నారు. దీంతో టెండర్లను సవాల్ చేస్తూ దాఖలైన రిట్‌పై విచారణను హైకోర్టు ముగించింది. గత విచారణలో రాష్ట్ర ప్రభుత్వం టెండర్ ప్రక్రియను కొనసాగించవచ్చుననీ, అయితే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసే వరకు టెండర్లను ఖారారు చేయవద్దంటూ మధ్యంతర ఆదేశాలిచ్చింది. టెండర్ నోటిఫికేషన్ రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరించిందనీ, వి3 ఎంటర్ ప్రయిజెస్ ప్రయివేట్ లిమిటెడ్, జెనిత్ మెటఫాస్ట్ ప్రయివేట్ లిమిటెడ్ రిట్లు దాఖలు చేశాయి. టేబుల్-డెస్క్, ఇతర ఫర్నీచర్ కొనుగోలుకు టెండర్ షరతుల ప్రకారం అన్ని అర్హతలు ఉన్నా పిటిషనర్ల కంపెనీలకు అనర్హత ఉన్నట్టుగా అధికారులు ప్రకటించారని పిటిషనర్లు వాదించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ రెండు టెండర్లను రద్దు చేసినట్టు గత సోమవారం హైకోర్టుకు చెప్పింది. డ్యూయల్ డెస్క్‌లకు రూ.360 కోట్లు, ఫర్నీచర్లకు రూ.195 కోట్లకు పిలిచిన ఫర్నీచర్ టెండర్లను మళ్లీ పిలుస్తామని చెప్పింది. తాజాగా రూ.190 కోట్ల విలువైన గ్రీన్ బోర్డుల టెండర్‌ను కూడా రద్దు చేసినట్లు ప్రభుత్వం చెప్పింది.
అవి ప్రభుత్వ భూములు
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో 26 ఎకరాల భూమిని 1996లో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత డి. రామానాయుడు కుటుంబం, దర్శకుడు కె.రాఘవేంద్రరావు, ఇతరులు కొనుగోలు చేసిన లావాదేవీలు చెల్లవని ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. సదరు భూముల్లో జోక్యం చేసుకోరాదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్‌ను కొట్టేయాలని అప్పీల్ దాఖలు చేసింది. దీనిని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.నందలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. ప్రభుత్వ వాదనలు పూర్తవడంతో రామానాయుడు, రాఘవేంద్రరావుల వాదనల కోసం విచారణను ఈ నెల మూడో వారానికి వాయిదా వేసింది.