Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ప్రవేశాలు
- మూడు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనే...
- ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ విద్యలో ఆరు కొత్త కోర్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఇంటర్ ఒకేషనల్ విభాగంలో ఆరు కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. కంప్యూటర్ సైన్స్‌కు సంబంధించి మూడు కోర్సులు, ఎలక్ట్రానిక్స్ విభాగానికి సంబంధించి మరో మూడు కోర్సుల్లో ప్రస్తుత (2022-23) విద్యాసంవత్సరం నుంచి ప్రవేశాలను చేపట్టనున్నట్టు వివరించారు. అయితే మూడు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనే ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న బజార్‌ఘాట్‌కు చెందిన ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీ, కూకట్‌పల్లిలో ఉన్న న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, ఫలక్‌నుమాలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ కొత్త కోర్సులు విద్యార్థులు చేరేందుకు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ కోర్సులను ప్రవేశపెట్టడం వల్ల ప్రభుత్వంపై అదనపు భారం లేదని తెలిపారు. మార్కెట్లో వస్తున్న పరిణామాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. వాటికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటర్ బోర్డు మేలోనే పంపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఉన్న కోర్సులకు అదనంగా మరో ఆరు కోర్సులను కొత్తగా అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల భవిష్యత్ అవసరాలు, ఉద్యోగావకాశాలను దృష్టిలో ఉంచుకుని ఇంటర్ బోర్డు ఈ కోర్సులను ప్రవేశపెట్టాలని భావించిన విషయం తెలిసిందే.
ఇంటర్లో కొత్త కోర్సుల వివరాలు
కంప్యూటర్ సైన్స్ విభాగం
- సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ (సీపీఎస్)
- క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా అనలిటిక్స్ (సీసీఅండ్బీఓఏ)
- ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (ఏఐఅండ్ ఎంఎల్)
ఎలక్ట్రానిక్స్ విభాగం
- ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్ (ఈవీఈ)
- బయో మెడికల్ ఇంజినీరింగ్ టెక్నీషియల్ (బీఎంఈ)
- ఎంబెడెడ్ సిస్టమ్స్ (ఈఎస్)