Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆందోళన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ, ఇప్పటికైనా సీఎం కేసీఆర్ నిద్రవీడాలని పీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి కోరారు. ప్రభుత్వం అప్రమత్తంగా లేకుండా పెను విపత్తు తప్పదని హెచ్చరించారు. ఈమేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ లో జనజీవనం అస్తవ్యస్తమైందన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకపోతే తీవ్ర పరిణామాలను చవి చూడాల్సి వస్తుందని చెప్పారు. 'ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్టు పరిధిలో ఇప్పటికే అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తక్షణమే సీఎం కేసీఆర్ సంబంధిత శాఖలతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలి. కడెం ప్రాజెక్టు పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి' అని కోరారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు సాగు, తాగునీటి శాఖలు, వైద్య, విద్యుత్తు, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులతో ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏ ప్రమాదం జరిగినా, చిన్నపాటి నష్టం వాటిల్లినా దానికి స్వయంగా సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని హెచ్చరించారు.