Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీటి సరఫరాకు అంతరాయం
- దెబ్బతిన్న రోడ్లనూ పునరుద్ధరించాలి : మంత్రి ఎర్రబెల్లి ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీవర్షాలతో మిషన్‌భగీరథ నీళ్ల సరఫరాకు ఆటంకం కలిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, నల్లగొండ, నిర్మల్ జిల్లాల్లో 2,222 గ్రామాల్లో మిషన్ భగీరథ మంచినీటి సరఫరాకు సమస్యలు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలకు వెంటనే నీటి సరఫరా కోసం పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో పంచాయతీ రాజ్ గ్రామీణాభివద్ధి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం. కృపాకర్‌రెడ్డి , పీఆర్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సంజీవరావు తదితర అధికారులతో మంత్రి సమీక్షించారు. వరదనీటితో రోడ్లు కోతకు గురవుతున్న నేపథ్యంలో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే కోతకు గురైన రోడ్ల వివరాలు, నష్టం అంచనా వివరాలను సేకరించి, వాటి పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. పంచాయతీ రాజ్ రోడ్ల సమస్యల పరిష్కారం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించారు. వర్షాలకు బాగా కురుస్తున్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలనీ, సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాకాల సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.