Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్
- బహుముఖ ప్రజ్ఞాశాలి అరుణ: ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి
నవతెలంగాణ - మహబూబ్‌నగర్
మహిళా సాధికారత కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్ పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ సొసైటీ భవనంలో బుధవారం నిర్వహించిన ఐద్వా జిల్లా మాజీ కార్యదర్శి అరుణ సంతాప సభలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం 'ప్రభుత్వాల విధానాలు-మహిళలపై ప్రభావం'' అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. 20 ఏండ్లపాటు కమ్యూనిష్టు ఉద్యమంలో పని చేసిన అరుణ ఇటు కుటుంబానికి అటు ప్రజా ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అరుణ మరణం తర్వాత రాములు కుటుంబం ఇబ్బందులు పడుతుందని అనుకున్నాం కానీ కుమారుడు, కుమార్తె అభ్యుదయంతో ముందుకు రావడం మరింత స్ఫూర్తినిచ్చిందన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి ఇన్నేండ్లయినా దేశంలో మహిళల పట్ల దాడులు, వివక్ష వంటివి కొనసాగుతూనే ఉన్నాయన్నారు. అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. దేశంలో ప్రధాన రంగమైన వ్యవసాయంలో మహిళలు అధికంగా పని చేస్తున్నారని, ఈ రంగాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. టాటా, బిర్లా, అంబానీలకు అప్పగించి సాగును నిర్వీర్యం చేసే కుట్రలకు కేంద్రం పాల్పడుతుందన్నారు. రేషన్ దుకాణాల్లో బియ్యంతోపాటు 13 రకాల సరుకులు తక్కువ ధరకు ఇచ్చే వారని, కానీ ఒక్కొక్కటికీ అన్నీ ఎత్తేశారని.. ఇకపై అది కూడా కేంద్రం చేతుల్లోకి వెళ్తే ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆందోలన వ్యక్తం చేశారు. ఐద్యా రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి మాట్లాడుతూ.. ఐద్వాతోపాటు సామజిక ఉద్యమాల్లో పని చేసిన అరుణ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. మహిళా సంఘాల బలోపేతానికి చేసిన కృషి అభినందనీయమన్నారు. పేదలను విద్యను దూరం చేసే కుట్రలకు ప్రభుత్వం పాల్పడుతుందన్నారు. ఇప్పటికే విద్యార్థుల్లేక 900 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని, మరిన్ని మూతపడే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా తెల్లరాల్లపల్లి వంటి మారుమూల గ్రామాల్లో చదివే చిన్నారులు వేధింపులకు గురైతే అధికారుల చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం అరుణ స్వగ్రామమైన జడ్చర్ల మండలం వాడియాలలో ఆమె స్థూపం వద్ద నాయకులు నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.రాములు, సీనియర్ నాయకులు కిల్లెగోపాల్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, ఐద్వా జిల్లా కార్యదర్శి పద్మ, సీనియర్ నాయకులు ఆర్.రామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.