Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రోటోకాల్ పాటించలేదని చైర్‌పర్సన్‌ను అడ్డుకున్న వికారాబాద్ ఎమ్మెల్యే వర్గీయులు
- ఇరు గ్రూపుల మధ్య తోపులాట
- పలువురికి స్వల్పగాయాలు
- వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో ఘటన
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్లో గ్రూపు తగాదాలు తారాస్థాయికి చేరాయి. ప్రోటోకాల్ ఆంశంలో జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యే గ్రూపుల మధ్య అగ్గి రాజేసింది. ఎమ్మెల్యే గ్రూపు జిల్లా పరిషత్ చైర్పర్సన్ వాహనంపై దాడికి దిగింది. ఆమె వాహనం ముందుకు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా రాళ్లు వేసి అడ్డుకుంది. వాహనంపై కూడా రాళ్లు వేయడంతో ఆమె వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. దాంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూరు గ్రామంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్లితే... వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మర్పల్లి మండలంలో బుధవారం పర్యటించారు. ఈ క్రమంలో ఆమె పట్లూర్ గ్రామంలోకి రాగానే స్థానిక వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు సమాచారం ఇవ్వకుండా, ప్రోటోకాల్ పాటించకుండా ఆమె మండలంలో పర్యటిస్తున్నారని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జడ్పీ చైర్పర్సన్ కాన్వారుని అడ్డుకున్నారు. దాంతో రెండు గ్రూపుల మధ్య వాగ్వివాదం జరిగింది. జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్‌రెడ్డి వాహనం దిగి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా వారు వినిపించుకోకుండా ఆమెకు వ్యతిరేకంగా 'జడ్పీ చైర్పర్సన్ గో బ్యాక్' అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు అను కూలంగా నినాదాలు చేశారు.
ఒకరికొకరు నెట్టుకోవడంతో కొంతమంది కార్య కర్తలు స్వల్పంగా గాయపడ్డారు. జడ్పీచైర్‌పర్సన్ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేయగా ఆమెను అడుగడుగునా అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా రాళ్లు వేశారు. చివరికి ఆమె వర్గానికి చెందిన కొందరు రాళ్లు తొలగించి రూట్ క్లియర్ చేయడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ గొడవ నడి రోడ్డుపై దాదాపు గంటసేపు జరిగిన సంఘటనా స్థలానికి పోలీసులు రాక పోవడం గమనార్హం. తనపై జరిగిన దాడిని జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తను ఎవ్వరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.ఈ ఘటనకు సంబంధించిన విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఆమె తెలిపారు. ఆమెపై దాడిని మాజీమంత్రి ప్రసాద్ కుమార్ ఖండించారు.