Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ పాలనలో సహకార వ్యవస్థ నిర్వీర్యం
- సంక్షోభంలో నెట్టబడుతున్న వ్యవసాయరంగం
- 27న పార్లమెంటు వద్ద ధర్నాలు
- పంటలవారీ సమస్యపై ఉద్యమాలు : ఏఐకేఎస్ నేత కృష్ణ ప్రసాద్, టి సాగర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలో కార్పొరేట్ పెత్తనం పెరిగిపోయిందని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ కోశాధికారి పి కృష్ణ ప్రసాద్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ అన్నారు. బీజేపీ పాలనలో సహకార వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. దీంతో మార్కెట్ వ్యవస్థ అధిపత్యం పెరిగిపోయిందన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో బీజేపీ సర్కారు విఫలమైందని విమర్శించారు. ఈనేపథ్యంలో ఈనెల 27న పార్లమెంటు వద్ద ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు. దీంతోపాటు పంటలవారీ సమస్యలపై ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. రెండు రోజులపాటు నిర్వహించిన ఏఐకేఎస్ వర్క్‌షాప్ ముగింపు సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వారు విలేకర్లతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా సమరశీల ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు పూను కుంటున్నదని విమర్శించారు. 2006 అటవీ హక్కుల చట్టాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నదని చెప్పారు. సహజ వనరులను, అటవీ సంపదను కార్పొరేట్లకు అప్పజేప్పేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్వించారు. దేశవ్యాప్తంగా 30 శాతం పైగా వ్యవసాయం కౌలు రైతుల ద్వారా జరుగుతున్నదనీ, వారికి కనీస హక్కులు కల్పించేందుకు కేంద్రం ప్రయత్నించడం లేదని విమర్శించారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పంటల వారీగా రైతులను సమీకరించేందుకు ఏఐకేఎస్ ప్రయత్నిస్తున్నదన్నారు. పాల రైతులు, కాఫీ తోటల రైతులు, పండ్లతోటల రైతులను సమీకరించేందుకు కృషి చేస్తున్నదని అన్నారు. అధిక వర్షాలు వచ్చి పంటలు నష్టపోయిన సందర్భంలో వారిని ఆదుకునేందుకు కేంద్రం ప్రయత్నిం చడం లేదని విమర్శించారు. రైతుల ఆదాయం పెరిగేందుకు కృషి చేస్తామన్న బీజేపీ...వారిని గాలికొదిలేసిందన్నారు. 70 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న సమస్యలకు పరిష్కరించడం లేదన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నాయని చెప్పారు.
నిరుద్యోగం, ధరల పెరుగుదల, అగ్నిపథ్, కార్మిక శ్రమదోపిడీ వంటి సమస్యలు దేశాన్ని పీడిస్తుంటే... మోడీ మాత్రం కార్పొరేట్ల సేవలో తరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అకాల వర్షాలు పడి అపార పంట నష్టం జరిగిందన్నారు. పంట నష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల రక్షణ కోసం ఒక చట్టాన్ని తీసుకరావాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేండ్లుగా బీజేపీ రైతులకు తీవ్రమైన ద్రోహం చేస్తున్నదనీ, దాన్ని విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేస్తామని తెలిపారు. సమావేశంలో ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, కేంద్ర నాయకులు కేశవ రావు, గోపి, యశ్వంత్ , కిషన్ గుజ్జర్ బాబు లాల్ యాదవ్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శులు మూడ్ శోభన్, లెల్లెల బాలకష్ణ వివిధ రాష్ట్రాల రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.