Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు అంతస్తులకు భారీగా బాదుడు
- టీఎస్ బీపాస్‌లో లేకపోవడంతోనే సమస్యలు : అధికారులు
- రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి
- ఇండ్లకూ 14శాతం ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
'గతంలో గ్రామపంచాయతీ అనుమతితో 200 గజాల్లో గ్రౌండ్ ఫోర్లో ఇంటిని నిర్మించుకున్నా. ప్రస్తుతం దానిపై అదనంగా ఒక అంతస్తు వేసుకోవడానికి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళితే గ్రామపంచాయతీ అనుమతి చెల్లదు.. మళ్లీ కొత్తగా అనుమతి తీసుకోవాల్సిందేనని అధికారులు అంటున్నారు. భవన నిర్మాణ అనుమతి ఫీజుతోపాటు 14శాతం ఎల్ఆర్ఎస్ ఫీజు సైతం చెల్లించాలంటున్నారు. ఇంత అన్యాయమా?' అని చెంగిచెర్లకు చెందిన కిరణ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
'గ్రామపంచాయతీ అనుమతితో 100 గజాల్లో గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఇంటిని నిర్మించుకున్నా. అదనపు అంతస్తు వేసుకోవడానికి మున్సిపాలిటీ కార్యాలయానికి వెళితే జీ+1కు మొత్తానికి కొత్తగా అనుమతి ఇవ్వాల్సి వస్తోందని చెప్పారు. 14శాతం ఎల్ఆర్ఎస్ ఫీజు కూడ చెల్లించాలని వివరించారు' అని తుర్కఎంజాల్కు చెందిన యాదగిరి తెలిపారు. ఈ సమస్య హైదరాబాద్‌లోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్, తుర్కఎంజాల్ మున్సిపాలిటీల్లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ ఉంది.
రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో కొత్తగా 71 మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) చుట్టూ బడంగ్పేట్, మీర్పేట్, బండ్లగుడజాగీర్, నిజాంపేట్, బోడుప్పల్, పీర్జాదిగుడ, జవహార్‌నగర్ కార్పొరేషన్లతోపాటు 13కుపైగా మున్సిపాలిటీలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఏరియాలో ఆశించిన స్థలం లేకపోవడం, కాలుష్యం తక్కువగా ఉండటం, రవాణ వ్యవస్థ మెరుగ్గానే ఉండటంతో జనం నివాసం కోసం ఎక్కువగా శివారు ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో ఒక్కో మున్సిపాలిటీ ఏడాదికి సుమారు 5వేల భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నారు.
ఎల్ఆర్ఎస్ దోపిడి
ఓపెన్ ప్లాట్లకు మాత్రమే ల్యాండ్ రెగ్యులరైజ్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) వర్తిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీ ల్లోని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఒక్కో ప్లాట్‌కు రూ.1000 చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన విషయం విదితమే. కానీ కొందరు శివారు ప్రాంతాల్లో భవన నిర్మాణ అనుమతుల పేరుతో పాత ఇండ్లకు సైతం ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు చేస్తున్నారు. 100 గజాల స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్ ఇంటికి గ్రామపంచాయతీ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఇంటిపై మరో అంతస్తు నిర్మించడానికి అనుమతి కోసం మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్తే గ్రామపంచాయతీ ఇచ్చిన అనుమతి చెల్లదని, మళ్లీ కొత్తగా జీ+1ఇంటికి భవన నిర్మాణ అనుమతి తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఉన్న ఇంటిపై అదనపు అంతస్తుకు అనుమతి తీసుకోవడానికి సుమారు రూ.30వేల వరకు ఖర్చవుతుంది. అదనపు అంతస్తుకు అనుమతి ఇవ్వడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. అయితే జీ+1 ఇంటికి అనుమతి తీసుకోవాలంటే రూ.80వేల నుంచి లక్ష వరకు అవుతుంది. గజానికి రూ.10వేలు ఉంటే 14శాతం ఎల్ఆర్ఎస్ ఫీజు రూ.1.40లక్షలు అవుతుంది. డెవలప్మెంట్ చార్జీలు, ఇతర చార్జీలు అన్నీ కలిపి సుమారు రూ.3లక్షల వరకు అవుతుందని అంచనా. ఇదిలా ఉండగా ఓపెన్ ప్లాట్లకు మాత్రమే ఎల్ఆర్ఎస్ వర్తిస్తుంది. ఇండ్లకు మాత్రం బిల్డింగ్ రెగ్యులరైజ్ స్కీమ్(బీఆర్ఎస్) వర్తిస్తుంది. బీఆర్ఎస్కు సంబంధించి కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.
ఆదాయం కోసం అడ్డదారిలో..
సర్కార్ ఖజానాలో ఆదాయం లేకపోవడంలో ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. దీంతో అడ్డదారిలో ఖజానా నింపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగమే ఎల్ఆర్ఎస్ దోపిడీ అన్న ప్రచారం జరుగుతోంది. భవన నిర్మాణ అనుమతుల కోసం కొత్తగా తీసుకొచ్చిన టీఎస్‌బీపాస్‌లో గ్రామపంచాయతీ అనుమతిచ్చిన భవనాలకు అదనపు అంతస్తుకు అనుమతి ఇవ్వడానికి అవకాశం లేదని, అందుకే పాత ఇంటిని ఖాళీ స్థలంగా భావించి కొత్తగా అనుమతి ఇవ్వడంతోపాటు ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు చేస్తున్నట్టు టౌన్‌ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఇంటి నిర్మాణం భారంగా మారింది. ఈ విషయంపై సర్కార్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.