Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ సగటు కంటే ఎక్కువ
- ఇతర రాష్ట్రాల్లో దారుణం : ఆర్బీఐ నివేదిక
- ఎల్డీఎఫ్ ప్రభుత్వ పనితీరు, కార్మిక సంఘాల పోరాట ఫలితమే : సీఐటీయూ
తిరువనంతపురం : కార్మికులకు వేతనాల విషయంలో కేరళ ప్రభుత్వం చక్కటి ప్రతిభను కనబర్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గ్రామీణ భారతదేశంలో రాష్ట్రాల వారీగా సగటు వేతనాన్ని ఈ నివేదికలో వివరించబడింది. ఈ నివేదిక సమాచారం ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ, సాధారణ వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికుల రోజువారీ వేతనాలు కేరళలో అత్యధికంగా ఉన్నాయి. భారత్లో కేరళ, ఇతర రాష్ట్రాలలో వేతనాల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్నది. కేరళలో కార్మికులకు చెల్లించే వేతనం.. అత్యల్ప వేతనం, జాతీయ సగటుతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. కేరళలో శాసన సభకు ఎన్నికైన సభ్యులకు (ఎమ్మెల్యే) చెల్లించే ప్రోత్సాహకాలు దేశంలోనే అత్యల్పంగా ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్లోని పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో కార్మికులకు చేసే చెల్లింపులు దారుణంగా ఉన్నాయి. ఎమ్మెల్యేలకు చెల్లించే ప్రోత్సాహకాలు అధికంగా ఉండటం గమనార్హం. కేరళలో అధిక వేతనాలు సంఘటిత, అసంఘటిత రంగాలలో ట్రేడ్ యూనియన్ ఉద్యమాల నిరంతర పోరాటానికి కారణమని చెప్పొచ్చని విశ్లేషకులు తెలిపారు. అంతేకాకుండా, కార్మికులకు హక్కులకు భరోసా కల్పించటంతో రాష్ట్రంలోని వామపక్ష ప్రభుత్వ పాత్ర కూడా కీలకమని వివరించారు. కేరళకు చెందిన ఒక నిర్మాణ కార్మికుడి సగటు వేతనం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నది. రాష్ట్రంలో నిర్మాణ కార్మికుడి సగటు వేతనం రూ. 829.7గా ఉండగా.. జాతీయ సగటు మాత్రం రూ. 362.2 గా ఉండటం గమనించాల్సిన అంశం. సాధారణ వ్యవసాయ కార్మికుల విషయంలో జాతీయ సగటు.. అంటే వారికి దక్కేది రూ. 309.9 మాత్రమే. అయితే, కేరళలో మాత్రం ఈ కార్మికులు రూ. 706.5 సంపాదిస్తున్నారు. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్, యూపీలు దారుణ ప్రదర్శనను కనబర్చాయి. ఈ రెండు రాష్ట్రాలు జాతీయ సగటు కంటే తక్కువగా చెల్లిస్తున్నాయి. 2014 సాధారణ ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ 'ఒక మోడల్ రాష్ట్రం'గా ప్రచారం చేయబడింది. అయితే, మూడు కేటగిరిల్లో తక్కువ వేతనాలతో దిగువ ఐదు రాష్ట్రాల జాబితాలో ఉండటం గమనార్హం. కార్మికులకు వేతనాలు అధికంగా దక్కటం వెనక కార్మిక సంఘాల పోరాటం ఉన్నదన్న విషయాన్ని నాయకులు గుర్తు చేశారు. మెరుగైన వేతనాల కోసం నిరంతర పోరాటాలు జరిగాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు అనతలవట్టం ఆనందన్ వివరించారు. కార్మిక వర్గం నిరంతర పోరాటాలు, రాష్ట్రాన్ని పాలించిన ఎల్డీఎఫ్ ప్రభుత్వ చొరవతోనే కార్మికులు అధిక వేతనాలు పొందుతున్నారని చెప్పారు.