Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలంలో మళ్లీ మూడవ హెచ్చరిక జారీ
- 66 అడుగులకు పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా
- సురక్షిత కేంద్రాలకు వరద బాధితులు
- వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ
- రక్షణ చర్యలకు హెలికాప్టర్లు సిద్ధం
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో గోదావరి ప్రమా దకర స్థాయిలో వరద ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాల జోరు తగ్గకపోవడంతో గోదావరి ఉధృతి బుధవారం ఉదయం నుంచి క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. భద్రాచలం పట్టణంలో ఉదయం 5 గంటలకు 50.80 అడుగులు ఉన్న గోదావరి 9 గంటలకు 51.40, మధ్యాహ్నం ఒంటిగంటకు 52.10, సాయంత్రం 4 గంటలకు 53.10, సాయంత్రం 7 గంటలకు 54.10 అడుగులకు చేరుకుంది. ఇది మరింత పెరిగి గురువారం ఉదయం 66 అడుగులకు వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రకటించారు. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టులో వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టు అధికారులు బుధవారం 18 గేట్లు ఎత్తి 57,818 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. భద్రాచలం నియోజకవర్గం భద్రాచలం పట్టణం, దుమ్మగూడెం, చర్ల మండలాల్లోని పలు ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరుకోవడంతో నాలుగు రోజులుగా ఏజెన్సీలో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఆయా మండలాల్లో వరద బాధితులను స్థానిక అధికారులు వరద బాధిత కేంద్రాలకు తరలించారు. వరద ముప్పు మరింత ఉందన్న ప్రచారంతో అధికారులు అప్రమత్తమై గోదావరి తీర పరివాహక ప్రాంత ప్రజలను యుద్ధప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లా మంత్రి పువ్వాడ అజరు కుమార్ బుధవారం మరోమారు భద్రాచలం వచ్చి వరద పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. గోదావరి వరద ఎంత వచ్చినా ప్రజలను కాపాడేందుకు అధికార యంత్రాంగం తగ్గ ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు. పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు తమ సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలిపారు. తక్షణ సహాయం అవసరమైతే హెలికాప్టర్‌ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ఐటీడీఏ, ఐటీసీలో ఇందుకోసం హెలిప్యాడ్లను సిద్ధం చేశామన్నారు. పోలీసు బలగాలతో పాటు, సీఆర్పీఎఫ్ తదితర బృందాలు కూడా రక్షణ చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు.