Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంప్ హౌజ్‌లు మునిగిపోవడానికి ప్రభుత్వమే కారణం
- పీసీసీ అధ్యక్షులు రేవంత్ వ్యాఖ్యలు
- కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నేత కత్తి కార్తీక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ అనాలోచిత విధానాలతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వరద పారుతోందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. పంప్‌హౌజ్‌లు మునిగిపోవడానికి ప్రభుత్వమే కారణమని చెప్పారు. వరదల్లో ప్రాణ, ఆస్థినష్టం సంభవిస్తే...సీఎం కేసీఆర్ రాజకీయాల్లో మునిగి తేలుతున్నారని విమర్శించారు. సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ సంక్షేమాన్ని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలనీ, రెండువేల కోట్ల సాయం అందించాలని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రేవంత్ టీపీసీసీ లీగల్ సెల్, ఎన్ఎస్యూఐ అనుబంధ సంఘాల పనితీరుపై ఆయన సమీక్షించారు. లోటుపాట్లను తెలుసుకుని దిశనిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. రోజంతా రేవంత్ గాంధీభవన్‌లో బిజిబిజిగా గడిపారు. అనంతరం బీజేపీ నేత కత్తి కార్తీక కాంగ్రెస్‌లో చేరారు. కుండువా కప్పి ఆమెను రేవంత్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు కేసీఆర్ సీఎం కావడం మన దౌర్భాగ్యమన్నారు. రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉంటే ఫిరాయింపు నేతలతో చర్చిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు పరాకాష్టగా మిగిలిందన్నారు. వరద ముంపుతో కాళేశ్వరం అతలాకుతలమైందనీ, పంప్‌హౌస్‌లన్నీ నీట మునిగిపోయాయని తెలిపారు. పంప్ హౌస్‌లు మునిగిపోవడంలో ప్రభుత్వం తప్పిదం లేదంటూ పెంటారెడ్డి అనే ఇంజనీర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్, శ్రీశైలం మునిగాయా? అనిప్రశ్నించారు. నిర్మాణం లోపం వల్లే పంప్‌హౌస్‌లలోకి నీళ్లు వచ్చాయని ఆరోపించారు. లక్షల ఎకరాల్లో పంటలు మునిగితే సీఎం కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే టీఆర్ఎస్ పని సగం అయిపోయిందనీ, మరో ఆరు నెలల్లో ఆ పార్టీ పూర్తిగా చచ్చిపోతుందని చెప్పారు. గోదావరిలో ఇసుక దోపిడీ జరగకుంటే,ఇంత ముంపు ఉండేది కాదన్నారు. వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి.. కేంద్రానికి నివేదిక పంపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి రూ.2వేల కోట్ల సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంటనష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కేంద్రానికి కాంగ్రెస్ లేఖ రాసిందన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రి పాలైతే కేటీఆర్ ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే తెలంగాణ ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, క్రమశిక్షణా సంఘం చైర్మెన్ జి చిన్నారెడ్డి, గీతారెడ్డి, లీగల్‌సెల్ చైర్మెన్ దామోదర్‌రెడ్డి, ఎన్ఎస్యూఐ అధ్యక్షులు వెంకట్ తదితరులు ఉన్నారు.