Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు
- 1,72,241 మంది దరఖాస్తు
- తెలంగాణలో 89, ఏపీలో 19 పరీక్షా కేంద్రాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు సోమవారం నుంచి షెడ్యూల్ ప్రకారం యథాతధంగా ప్రారంభం కానున్నాయి. ఈనెల 20 వరకు ఆన్లైన్లో ఈ రాతపరీక్షలు జరుగుతాయి. భారీ వర్షాల కారణంగా గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయా? లేదంటే వాయిదా పడతాయా? అనే చర్చ జరిగింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పరీక్షల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపడం గమనార్హం. ఈ మేరకు ఎంసెట్ కన్వీనర్ ఎ గోవర్ధన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగానికి 1,72,241 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారని వివరించారు. తెలంగాణలో 89, ఏపీలో 19 కలిపి మొత్తం 108 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి రోజూ రెండు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం తొమ్మిది గంటలకు, మధ్యాహ్న మూడు గంటలకు ఈ పరీక్షలు ప్రారంభమవుతాయని వివరించారు. ఒక్కో విడతలో 29 వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తారని తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయానికి ముందే చేరుకోవాలని సూచించారు. హాల్టికెట్లో ఉన్న మార్గదర్శకాలను పాటించాలని కోరారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతి ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. అందుకే విద్యార్థులు ఇబ్బందులు పడకుండా సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని కోరారు.