Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జల దిగ్బంధంలోనే పలు గ్రామాలు
- గ్రామానికి గ్రామానికీ మధ్య సంబంధాలు బంద్
- తాగునీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం
- కరకట్ట ఎత్తు పెంచాలని వరద బాధితుల ధర్నా
- అండగా నిలిచిన సీపీఐ(ఎం)
- నేడు గవర్నర్, సీఎం రాక
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం ఏజెన్సీలో జలప్రళయాన్ని సృష్టించిన వరద గోదావరి ఎట్టకేలకు తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద శుక్రవారం రాత్రి ఒంటి గంటకు 71.30 అడుగుల వరకు ప్రవహించిన గోదావరి.. అనంతరం నాలుగు గంటలపాటు నిలకడగా ఉండి శనివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి తగ్గుముఖం పట్టింది. రాత్రి 10 గంటల సమయానికి భద్రాచలం వద్ద 67.40 అడుగుల ప్రవాహం కొనసాగుతోంది. గోదావరి క్రమేపీ తగ్గుముఖం పడుతుండటంతో ఏజెన్సీ వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
భద్రాచలం పట్టణాన్ని మూడు వైపులా గోదావరి వరద చుట్టుముట్టింది. కరకట్టల చివరిభాగం నుంచి గోదావరి ఒక్కసారిగా పట్టణంలోకి చొరబడింది. మరో ఐదు అడుగులు గోదావరి వస్తే భద్రాచలం పట్టణం పరిస్థితి ఏమిటి అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. కరకట్టల ఎత్తు పెంచకపోతే పుణ్యక్షేత్రం పరిస్థితి అధోగతేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భద్రాచలం పట్టణానికి చెందిన సుభాష్‌నగర్ కాలనీ వాసులు కరకట్ట ఎత్తు పెంచాలని, తమ కాలనీని కాపాడాలని కోరుతూ శనివారం భద్రాచలం ప్రధాన రహదారిపై బైటాయించారు. వరదనీటిలోనే ఉండి ధర్నా చేశారు. వరద బాధితుల పక్షాన సీపీఐ(ఎం) అండగా నిలిచింది.
ఇదిలా ఉండగా భద్రాచలం పట్టణంలోని విస్తా కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన స్లులూయిస్ మోటార్లు వర్కింగ్‌లో లేక బ్యాక్ వాటర్ వెనక్కు వచ్చి స్థానిక రామాలయం పరిసర ప్రాంత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. గోదావరి వరద ముంచెత్తడంతో భద్రాచలం నియోజకవర్గంలోని పలు మండలాల గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకుని ఉన్నాయి. భద్రాచలం పట్టణానికి కూనవరం, చర్ల ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరుకోవడంతో భద్రాచలంకు వచ్చే పరిస్థితి లేదు. పట్టణంలోని రాజుపేట కాలనీ, శాంతి నగర్ కాలనీ, అయ్యప్ప కాలనీలో వరద నీరు చేరుకుంది. దుమ్ముగూడెం మండలంలో తూరుబాక, రేగుబల్లి, బై రాగులపాడు, పర్ణశాల ప్రధాన రహదారిపై వరదనీరు ఇంకా ఉండటంతో ఈ మండలంలో గ్రామాలకు మధ్య సంబంధాలు కట్ అయ్యాయి. వారం రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు సరఫరాకు అవకాశం లేకపోవడంతో మండల ప్రజలు తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు సిగల్ నిలిచిపోవడంతో సెల్ఫోన్లు కూడా పనిచేయని దుస్థితి ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మండలం అంతా అంధకారం మయం అయింది. పలుచోట్ల అంతర్గత రహదారులు భారీగా దెబ్బతిన్నాయి.
వేలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. ఏజెన్సీ మండలాలు జలమయం కావడంతో ప్రజలు తమ ఇండ్లను విడిచి, గొడ్డు గోద వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. భద్రాచలం పట్టణంలో మొత్తం 18 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1219 కుటుంబాలకు చెందిన 4,667 మంది వరద బాధితులు ఆయా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. దుమ్ముగూడెం మండలంలో లక్ష్మీ నగరం, మంగు వాయి బాడవ, సీతానగరం తదితర గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. చర్ల మండలంలో చర్ల లో 5, సత్యనారాయణపురంలో 2, తేగడలో ఒక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో అంతంతమాత్రమే సౌకర్యాలు ఉన్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేడు సీఎం, గవర్నర్ రాక
భద్రాచలంకు ఆదివారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రానున్నారు. వరద బాధిత పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులకు సుమారు నాలుగు వేల వరద సహాయక కిట్లను, ఆహార పొట్లాలు అందించనున్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా కడెం నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకాన్ని ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరద నష్టం, పునరావాస కేంద్రాల్లో అందుకున్న సౌకర్యాలపై మంత్రి పువ్వాడ అజరుకుమార్, జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
వరద బాధితుల ఆందోళన
భద్రాచలం కరకట్టను ఎత్తు పెంచి పోలవరం, నెల్లిపాక, చర్ల, దుమ్ముగూడెం వరకు పొడిగించాలని వరద బాధితులు పట్టణంలోని డిగ్రీ కాలేజ్ ముందు రోడ్డుపై బైటాయించి ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో సీపీఐ(ఎం) నాయకులు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏ.జె.రమేష్ మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, భద్రాచలం గోడు పట్టదా అని ప్రశ్నించారు. గోదావరి వరద నుంచి పట్టణానికి రక్షణ కవచంగా కరకట్ట ఉన్నప్పటికీ పెద్దఎత్తున ముంపు సంభవించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. బూర్గంపహాడ్ మండలంలోని మోరంపల్లి బంజర, లక్ష్మీపురం, సారపాక ఐటీసీ బీపీయల్ స్కూల్లలోని పునరావాస కేంద్రాలను సీపీఐ(ఎం) నాయకులు పరిశీలించారు. వరద బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ముంపు బాధితులను ఆదుకోవాలని పాల్వంచ ప్రధాన రహదారిపై వైఎస్ఆర్టీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.