Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డ్రయింగ్ ప్లాట్‌ఫామ్‌ల
- డబ్బుల కోసం ఎదురుచూపు
- రాష్ట్రవ్యాప్తంగా రూ.750 కోట్లలో సగంలోపే మంజూరు
- వారంలోపే బిల్లులు ఇస్తామనడంతో నిర్మాణం
- ఖమ్మం జిల్లాకు రూ.36.48 కోట్లకుగాను రూ.18 కోట్లే విడుదల
- అధికారుల ఒత్తిడితో నిర్మిస్తే తిప్పలు తప్పట్లేదంటున్న రైతులు
- పంట పెట్టుబడికి డబ్బులు లేక ఇబ్బందుల్లో అన్నదాతలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పంట నూర్పిడి, ఆరబెట్టేందుకు కల్లాలు లేక.. రోడ్ల వెంట, పొలాల్లో శుభ్రం చేసి ధాన్యం, ఇతర పంటలు ఆరబోస్తే అకాల వర్షాలకు తడిచిపోతున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రహదారులపై ధాన్యం ఎండబెడితే రోడ్డు ప్రమాదాలూ జరుగుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికంటూ.. రాష్ట్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద కల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రెండేండ్లుగా సిమెంట్ కాంక్రీట్ కల్లాల నిర్మాణం దిశగా రైతులను ప్రోత్సహిస్తోంది.
హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో కల్లాల నిర్మాణం కోసం రూ.750 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి రాయితీ కూడా కల్పించింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం, బీసీ, ఓసీలకు 90శాతం రాయితీపై నిధులను సమకూరుస్తున్నది. 90% రాయితీ పొందుతున్న రైతులు 10శాతం భాగస్వామ్య పని రూపంలో చెల్లించేలా (ఉపాధిహామీ కూలీ) వెసులుబాటు కల్పించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. నిర్మించిన వారంలోపే కల్లం విస్తీర్ణాన్ని బట్టి రూ.లక్ష వరకు లబ్దిదారుల అకౌంట్లలో జమ చేస్తామని చెప్పింది. వంద, 90శాతం రాయితీ ఉన్నా చాలా ఊళ్లలో రైతులు సకాలంలో బిల్లులు రావని నిర్మాణానికి ముందుకు రాలేదు. డ్రైయింగ్ ప్లాట్‌ఫామ్‌లతో ఉపయోగం, మెరుగైన సబ్సిడీ, అధికారుల హామీతో గడిచిన రెండేండ్లలో వందకు 20, 30 మంది మాత్రమే కల్లాలు నిర్మించారు. అయితే, బిల్లులు రాక సగం మంది డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. వారంలోపే వస్తాయన్న బిల్లులు ఆరు నెలలైనా రాకపోవడంతో పంట పెట్టుబడులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రైతులు వాపోతున్నారు.
కేటాయింపులు సరే.. మంజూరు మాటేంటి..
రాష్ట్రవ్యాప్తంగా రూ.750 కోట్ల కేటాయింపుల్లో అత్యధికంగా నల్లగొండకు రూ.56.31కోట్లు, సంగారెడ్డికి రూ.38, రంగారెడ్డికి రూ.37, ఖమ్మానికి రూ.36.48 కోట్ల చొప్పున కేటాయించింది. అతితక్కువగా మేడ్చల్- మల్కాజ్‌గిరికి రూ.4.75 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రూ.14.16 కోట్లు, రూ.20 కోట్లకు పైగా 17 జిల్లాలకు కేటాయింపులు చేసింది. కల్లం విస్తీర్ణాన్ని బట్టి 50 చదరపు మీటర్ల కల్లానికి రూ.54వేలు, 60 స్కేయర్ మీటర్లకు రూ.68వేలు, 75 చ.మీ కల్లం నిర్మాణానికి రూ.80వేల చొప్పున మంజూరు చేయాలి. నిబంధనల ప్రకారం కల్లం నిర్మించిన మూడు, నాలుగు రోజులు గరిష్టంగా వారంలోపు బిల్లులు వస్తాయని అధికారులు రైతులను ఒప్పించి కల్లాలు నిర్మిస్తున్నారు. కానీ కల్లాలు నిర్మించి నెలలు గడిచినా బిల్లులు కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఇలా..
బిల్లులు సకాలంలో వస్తాయో రావోనన్న భయంతో ఖమ్మం జిల్లాలో కల్లాల నిర్మాణానికి 28% మంది రైతులు మాత్రమే ముందుకొచ్చారు. జిల్లాలో 2,186 కల్లాల నిర్మాణం చేపట్టగా 713 మాత్రమే పూర్తయ్యాయి. వీరికి రూ.17.96 కోట్లు మంజూరైనట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కానీ మార్చి, అంతకుముందు నిర్మించిన కల్లాలకు కూడా బిల్లులు రాలేదని రైతులు వాపోతున్నారు.
జిల్లాలో అత్యధికంగా సింగరేణి మండలానికి 140 కల్లాలు మంజూరు కాగా 21 (15%) పూర్తి కాగా, 119 నిర్మిస్తున్నారు. గరిష్టంగా కల్లూరు మండలంలో 130కి.. 46 కల్లాలు పూర్తి చేశారు. వీరిలో సగం మందికీ బిల్లులు రాకపోవడం గమనార్హం. ఊహించినట్టుగానే బిల్లులు సకాలంలో రాకపోవడంతో పంట పెట్టుబడుల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని బాధిత రైతులు వాపోతున్నారు.
నాలుగు నెలలైనా బిల్లు రాలేదు
మార్చిలో కల్లం నిర్మించా. నాలుగు నెలలైనా రూ.70వేల బిల్లు రాలేదు. మూడు, నాలుగు రోజుల్లో బిల్లు వస్తుందని అధికారులు చెప్పడంతో కట్టినాను. ఇంత ఆలస్యమవుతుందంటే దాని జోలికి పోయేవాన్ని కాదు. 75 చ.మీ విస్తీర్ణంలో సిమెంట్‌తో నిర్మించా. దీనికి 90% సబ్సిడీ పోను రూ.70వేలు వస్తాయని అధికారులు చెప్పారు. కానీ నాకు రూ.లక్షకు పైగా ఖర్చు వచ్చింది. బిల్లు ఇప్పటికీ రాకపోవడంతో పంట పెట్టుబడుల సమయంలో ఇబ్బంది పడుతున్నా. అస్సలు బిల్లులు వస్తాయో రావోనని ఆందోళనగా ఉంది.
- తోట నాగరాజు- చింతపల్లి- ఖమ్మం రూరల్
ఇప్పటి వరకు 30శాతం బిల్లులు ఇచ్చాం
మెటీరియల్ స్టేటస్‌ను బట్టి బిల్లులు మంజూరు చేస్తున్నాం. ఇప్పటి వరకు 30శాతం వరకూ ఇచ్చాం. ప్రభుత్వం నుంచి రాగానే మిగతా చెల్లింపులు చేస్తాం. సంబంధిత రైతులు మమ్మల్ని సంప్రదిస్తే బిల్లు మంజూరు స్టేటస్ చెబుతాం. కొంత ఆలస్యమైనా రైతులందరికీ బిల్లులు వస్తాయి. ఎలాంటి ఆందోళనా అవసరం లేదు.
- విద్యాచందన- డీఆర్డీఏ పీడీ - ఖమ్మం