Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కదిలిస్తే కన్నీటి ఘోసే
- సమస్యల చట్రంలో రైతన్న
- ఓవైపు వానలు...మరోవైపు పెట్టుబడి భారాలు
- రుణాలకు బ్యాంకుల విముఖత
- మార్కెట్లో దళారుల మోసాలు
- రైతు బంధు వచ్చినా మిగతా సమస్యలతో అన్నదాత సతమతం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీవర్షాలకు వ్యవసాయం అతలాకుతలమైంది. భూమిలో నాటిన విత్తనం బురదపాలైంది. అన్నదాత శ్రమ బుడిదలో పోసిన పన్నీరైంది. మొలకెత్తిన విత్తనం మురిగిపోయింది. బతుకుదెరువు కోసం అప్పోసప్పో చేసి పంటలేస్తే చేతికి రాకుండానే వానలకు దెబ్బతిన్నాయి. కండ్లముందే దెబ్బతిన్న పంటలను చూసి అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఏ రైతును కదిలించినా కన్నీటి ఘోషను వినిపిస్తున్నారు.వ్యవసాయాన్ని నమ్ముకుని అంతంతా మాత్రంగా బతుకీడుస్తున్న అన్నదాతలకు ఈ విపత్తు కోలుకోలేని దెబ్బతీసింది. పెట్టిన పెట్టుబడిపాయే...చేసిన కష్టామూ పాయే అంటూ వారు ఆవేదన చెందుతున్నారు. వర్షాల నేపథ్యంలో నవతెలంగాణ బృందం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం పరిసర గ్రామాల్లో ఇటీవల పర్యటించింది. రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంది. రోహిణి కార్తెలో వానలుపడ్డాయి. పంటలు మంచిగా పండుతాయన్న నమ్మకం కుదిరింది కానీ అనుహ్యంగా అధిక వర్షాలు ముంచుతాయని అనుకోలేదని అన్నదాతలు చెబుతున్నారు. ఇప్పటికే మార్కెట్లో విత్తనాల ధరలు బాగా పెరిగాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం వల్ల వాటిని ప్రభావం వ్యవసాయంపై తీవ్రంగా ఉన్నది. పత్తి, వరి, మొక్కజొన్న, జొన్న. సోయాబీన్, కూరగాయల విత్తనాలు ఇటీవల మూడింతలు పెరిగాయి. చాలా మంది రైతులు ప్రయివేటు అప్పులు చేసి విత్తనాలు నాటారు. మొలకెత్తిన పత్తి విత్తనాలు వానకు దెబ్బతిన్నాయి. మరోసారి విత్తనం వేయాల్సి పరిస్థితి వచ్చింది. ఓవైపు వానలు, మరోవైపు పెట్టుబడి రైతులను కుంగదీస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు రైతన్నను దెబ్బతీస్తుండగా, అందుకోవాల్సిన బ్యాంకులు కూడా రుణం ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేయడంతో మూలిగే నక్కపై తాటికాయపడ్డట్లైంది. చాలా చోట్ల పాత బాకీ ఉందనో, గతంలో తీసుకున్న రుణం చెల్లించలేదనో పంట రుణాన్ని ఇవ్వడం లేదు. రైతు బంధు పథకం అన్నదాతకు చేదోడు, వాదోడుగా ఉన్నా...అంతకు మించిన సమస్యలు చుట్టుముట్టాయి. పాత బాకీ కింద రైతు బంధు డబ్బులను జమ చేసుకుంటున్నాయి. చివరకు ఉపాధి కూలీ డబ్బులను సైతం బ్యాంకులు వదిలిపెట్టడం లేదు. పంట రుణం కావాలంటూ బ్యాంకోళ్ల చుట్టూ తిరిగి కాళ్లావేళ్లా పడిన కనికరించడం లేదు. దీంతో విధిలేని పరిస్థితి ఊరి సావుకారి వద్ద మూడు రూపాయల మిత్తికి తెచ్చుకుంటున్నారు. వానలకు విత్తనం నీటిపాలు కావడంతో మరోసారి అప్పులు చేయకతప్పదు.'రెండు సార్లు విత్తనాలు వేయడం...రెండు సార్లు అప్పులు చేయడం' ఇది రైతును కోలుకోలేని దెబ్బతీస్తున్నది. అక్కడక్కడ వానలకు టామాట నారు పాడైపోయింది. కూరగాయల మళ్లు దెబ్బతిన్నాయి. మళ్లలో నీరు చేరి తీగ మురిగిపోయింది. ఆరుట్ల గ్రామంలో సోయసాగు చేసే మహిళా రైతును పలకరించగా... ఒక మడిలో ఆనంకాయ సాగు చేసున్నానని చెప్పింది. 200 నుంచి 600 కాయలు కొత్తపేట రైతుబజారుకు తీసుకెళ్లితే... రవాణా చార్జీలు పోను రూ 600 వందలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా దగ్గర తక్కువకు కొని దళారులు ఎక్కువకు అమ్ముకుంటున్నారు. రైతును ముంచుతున్నారు. ఏం లాభం లేదు. రైతుబజారుల్లో అమ్ముకునేందుకు వీలులేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ధరణితో వచ్చిన సమస్యలు కూడా తమను ఇబ్బందులు పెడుతున్నాయనిచెబుతున్నారు. 2018 నుంచి తమ రైతుబంధు డబ్బులు వేరొకరి ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు. ఇప్పటికీ ఆ సమస్యల పరిష్కరం కావడం లేదు.ఆ డబ్బులు ఇవ్వమని అడిగితే మీ డబ్బులా అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి వసతిలేకపోయిన వర్షాధార పంటగా టమాట సాగు చేస్తున్న ఇద్దరు వృద్ధదంపతులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పైసలు పెట్టి రెండుసార్లు మెత్తగా దున్నించినం. నారు వేయకముందే వానలు పడి కలుపు పెరిగింది. కూలీలతో కలుపు తీస్తే ఎకరాలకు మూడువేలు అవుతుందనే కారణంతో ఆ వృద్ధ దంపతులు కలుపుతీస్తున్నారు. ఎకరాకు పెట్టుబడి 8 వేలు ఖర్చు పెట్టారు. ఆ పంట చేతికొచ్చేదాకా నమ్మకం లేదని ఆవేదన చెందుతున్నారు. అధికవర్షాలతో ఏ రైతును కదిలించిన వారి బాధలు వర్ణాణాతీతం. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ఏం భరోసా ఇస్తుందో వేచి చూడాల్సిందే...
అప్పుందని బ్యాంకు రుణమిస్తలే..
నాకు ఎకర పొలం ఉంది. పత్తి వేశారు. వానలకు మొలక చచ్చిపోయింది. మల్లా విత్తనాల కోసం అప్పుజేయాల్సిందే. నాకు బ్యాంకులో అప్పుందని బాకీ ఇస్తలేరు. రైతు బంధు డబ్బు, ఉపాధి కూలీ డబ్బులను అప్పుకింద జమచేసుకున్నారు. ఎంత బతిమిలాడినా బాకీ ఇస్తలేరు. బిడ్డ పెండ్లి ఉంది అంటే కూడా బ్యాంకొళ్లు చెవిన పెడ్తలేరు.
- అనంగల శంకరయ్య
రైతుకు ఏమీ మిగలదు
నాకు రెండు ఎకరాలు పొలముంది. ప్రస్తుతం ఆనంకాయ సాగు చేస్తున్నా. కొత్తపేట మార్కెట్ తీసుకపోత. బస్సుకిరాయి 70 రూపాయలవుంది. రెండువందల ఆనంకాయలు తీసుకపోతే రెండొంద యాభై కూడా రావు. మధ్యవర్తులకు లాభం. మాకేమీ మిగలదు. బెండ, టమాట పెడతాం. ఒకదాంట్లో పోయినా ఇంకోదాంట్లో వస్తాయనే ఆశలో చేస్తున్నం. ఈవానలకు పంటలు పాడైతున్నరు.
- మహిళా రైతు బండికాడి లక్ష్మమ్మ
రూపాయికి ఒక టమాట మొక్క కొంటాం
ఎకరా భూమిలో నీటివసతిలేదు. వర్షాధార పంటగా టమాట పెడతం. మొదటిసారి వాన పడగానే దున్నిపించినం. ఇప్పుడు కురిసిన వానలకు మళ్లీ కలుపు బాగా పెరిగింది. గుత్తకిస్తే మూడువేలు అడుగుతున్నరు. మేమే కలుపుతీస్తున్నం. ఒక రూపాయికి టమాట మొక్క కొనుక్కొచ్చి వానపడగానే నాటుతాం. ఎకరాకు పదివేల మొక్కలు అవసరం.వాటికి ఐదువేలు ఖర్చు అవుతుంది. మొత్తం రూ ఎనిమిదివేల నుంచి పదివేల ఖర్చు అవుతుంది. అప్పుచేసి పెట్టినం. ధర ఉంటే మిగులుతుంది. లేదంటే అప్పులుమీదపడతాయి.
- చీమర్ల యాదయ్య