Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుళ్లిన కోడిగుడ్లు, నాసిరకం ఆయిల్ డబ్బాలతో నిరసన
- వివిధ రాజకీయ పార్టీల నాయకుల ఆందోళన.. అరెస్ట్
- నిజామాబాద్‌లో విద్యార్థులకు పలువురి పరామర్శ
నవతెలంగాణ-బాసర/నిజామాబాద్‌సిటీ
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో విద్యార్థులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. శనివారం అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం వద్ద కుళ్లిన కోడిగుడ్లు, వంట కోసం వాడుతున్న నాసిరకం నూనె డబ్బాలు, ఇతర వస్తువులను పెట్టి నిరసన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ అధికారులు తమతో కలిసి మెస్‌లలో భోజనం చేస్తామని ఇచ్చిన హామీ హామీగానే మిగిలిపోయిందని, మెస్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఆహారం కలుషితమైందని విద్యార్థులు ఆరోపించారు. సంబంధిత అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండటంతో మెస్‌లో నాసిరకం భోజనం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన మెస్ యాజమాన్యాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సంబంధిత మెస్‌లపై చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో.. యూనివర్సిటీ డీన్ రంజిత్ ఫిర్యాదు మేరకు కేంద్రీయ బండార్, ఎస్ఎస్ క్యాటరింగ్‌పై బాసర పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్యం మెరుగవడంతో వారు శనివారం యూనివర్సిటీకి వచ్చినట్టు అధికారులు తెలిపారు. నిజామాబాద్ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను అర్ధరాత్రి ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మెన్ వెంకటరమణ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రాణాపాయం లేదని, అందరూ డిశ్చార్జి అయ్యారని వైస్ చైర్మెన్‌తో పాటు డైరెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఏఎస్పీ కిరణ్ కారే యూనివర్సిటీలో పర్యవేక్షించారు.
వివిధ పార్టీ నాయకుల ఆందోళన.. అరెస్ట్
ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ జరిగి వందల సంఖ్యలో విద్యార్థుల ఆరోగ్యం క్షీణించడంపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు శనివారం యూనివర్సిటీ వద్ద ఆందోళన నిర్వహించారు. వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ అమలు కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్ యూనివర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీ సులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థులను ప రామర్శించి వెళ్తామన్నా అడ్డుకోవడం ఏమిటని కాంగ్రెస్ నాయకులు పోలీ సులను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి ముధోల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి అరవింద్‌ను దిలావర్పూర్లో అరెస్టు చేశారు. యూనివర్సిటీలోకి వెళ్లేం దుకు యత్నించిన సహాయ కార్యదర్శి నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. బీజేవైఎం నాయకులు ప్రధాన గేటు వద్ద ఆందోళన నిర్వహించగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వైయస్సార్సీపీ, బీఎస్పీ, తెలంగాణ జన సమితి నాయకులూ ఆందోళన చేయగా, వీరిని సైతం పోలీసులు అరెస్టు చేశారు.
బాసర విద్యార్థులకు పలువురి పరామర్శ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాసర ఐఐటీ విద్యార్థులను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ(ఎం), ఎస్ఎఫ్ఐ నాయకులు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పరామర్శించారు. పలువురు రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు పరామర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఎగ్జిట్ మోడ్‌లో ఉందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. అందుకే ప్రజలను, విద్యార్థులను పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ఆస్పత్రిలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించక పోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ ఆస్పత్రి ముందు ధర్నా చేపట్టారు.
నెల గడవకముందే ఫుడ్‌పాయిజన్
విద్యార్థులు గత నెలలో సమస్యలు పరిష్కరించాలని 9 రోజులు రిలే నిరాహార దీక్ష చేస్తే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థుల వద్దకు వచ్చారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి నెల గడవకముందే ఫుడ్ పాయిజన్ కావడం, విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుందని విమర్శించారు. విద్యార్థి సంఘాల పోరాటంలో పధానమైన ఎజెండా అయిన మెస్ కాంట్రాక్టర్‌ను ఇంతవరకు రద్దు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే సీఎం కేసీఆర్ త్రిపుల్‌ఐటీకి వచ్చి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.