Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9 శాతానికిపైగా గిరిజన రిజర్వేషన్లు బీజేపీతోనే సాధ్యం : ఈటల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న గవర్నర్ తమిళిసైకి రాష్ట్ర ప్రభుత్వం కనీస భద్రత కల్పించకపోవడం, ఎస్పీ, కలెక్టర్ లేకపోవడం రాజ్యాంగ ఉల్లంఘననే అని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాజ్యాంగ పరిరక్షకురాలైన గవర్నర్‌ను అవమానించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. గిరిజనులకు జనాభా శాతానికి అనుగుణంగా 9 శాతానికిపైగా గిరిజన రిజర్వేషన్లు తమ పార్టీతోనే సాధ్యమనీ, రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మా గెలిచిన తర్వాత ఆమె చేతుల మీదుగా తీసుకొస్తామని హామీనిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీఎల్పీనేత రాజాసింగ్, ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు ఆదివాసీలు, మహిళల పట్ల కనీస గౌరవం లేదని విమర్శించారు. గిరిజనులు, ఆదివాసీలకు పోడు పట్టాలివ్వకుండా వారిపై ఫారెస్టు అధికారులతో దాడులు చేయించడం దారుణమన్నారు. మోడీ సర్కారుపై కేసీఆర్ మాటలన్నీ పచ్చి అబద్ధాలన్నారు. ఎఫ్ఆర్బీఎమ్ చట్టం అన్ని పార్టీల పాలిత రాష్ట్రాలకు ఒకేలా ఉంటుందనే కనీస సోయి కూడా లేదా? అని ప్రశ్నించారు. పలు అంశాల ఆధారితంగా పన్నుల ఆదాయం కేటాయింపు 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంపిణీ జరుగుతుందనీ, కేంద్ర ఇష్టమొచ్చినట్టు పంచడానికి వీలులేదని గుర్తుచేశారు. ఉపాధి హామీ చట్టం నిధుల దుర్వినియోగంపై సోషల్ ఆడిటింగ్ కోసం కేంద్ర బృందాలు వస్తుంటే దాన్నీ వివాదాస్పదం చేయడం దారుణమన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో శ్మశాన వాటికలు, పంచాయతీ కార్యాలయాలు, మహిళా సంఘాల భవనాలు, రోడ్లు, హరితహారం కార్యక్రమం ఇలా అన్నీ నరేగా మెటీరియల్ కాంపోనెంటివ్ నిధుల కిందనే జరుగుతున్నాయని నొక్కిచెప్పారు. కేసీఆర్ మాటల్లో విశ్వసనీయత లేదని విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర మంత్రులు వస్తారనీ, తప్పకుండా తెలంగాణకు సాయం చేస్తామని హామీనిచ్చారు. రాజాసింగ్, రఘునందన్‌రావులతో కలిసి ముంపు ప్రాంతాల్లోని బాధితులను నేరుగా వెళ్లి కలుస్తామన్నారు. తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారనీ, పుట్టే ప్రతి బిడ్డపైనా రూ.1.25 లక్షల అప్పు ఉందని వివరించారు.