Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై రేవంత్ డిమాండ్
- ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలు చేశారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. జేమ్స్‌బాండ్-006 కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపి, వాస్తవాలు రాబట్టాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వరదల్లో మునిగిపోవడంతో క్లౌడ్ బరస్ట్‌లో విదేశాల కుట్ర జరిగాయని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ లక్డికాపుల్లో ఓ హోటల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం యాక్షన్‌పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి మనిక్కం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోస్‌రాజు, వి.హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్‌బాబు, ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ వరదల్లో ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి ఇలాంటి ప్రకటన చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు సంపూర్ణ సమాచారముంటే, విదేశీయుల కుట్ర గురించి ఇంటెలిజెన్స్‌కు సమాచారాన్ని అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వానికి ఆ వివరాలు ఇవ్వాల్సిన బాధ్యత సీఎంకు లేదా? అని ప్రశ్నించారు. ఆ కుట్రల వెనుకాల ఎవరున్నారో తెలియలాంటే ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాలని కోరారు. గోదావరి, కృష్ణా నదులపై క్లౌడ్ బరస్ట్ చేస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నష్టం జరిగే అవకాశముందని చెప్పారు. సింగరేణి రెస్క్యూలో చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ను జాతీయపార్టీగా మలుచుకునేందుకు సమీక్షలు చేస్తున్నారు తప్ప వరదలపై సమీక్షలు చేయలేదన్నారు. విపత్తు కింద రూ 2వేల కోట్ల సహాయం అడగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు వరద సహాయక చర్యలు చేపట్టడం వల్ల సీఎం బయటకు వచ్చి వరద ప్రాంతాలకు వెళ్ళారని చెప్పారు. పంట, ఆస్తి నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని ఆశించామన్నారు. కేసీఆర్, బండి సంజరు బడేమియా ,చోటేమియాలాగా ఇద్దరు మిత్రుల్లా మోడీ, కేసీఆర్ ఇద్దరి వైఫల్యాలున్నాయని చెప్పారు. గుజరాత్లో వరదలు రాగానే రూ 1000 కోట్లు విడుదల చేసిన కేంద్రం...తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక సహాయం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ మాట్లాడిన తర్వాత పంప్‌హౌజ్‌ల మునకపై పార్లమెంటులో వాయిదా తీర్మానం ఇస్తామన్నారు. ఆగస్టు 2న సిరిసిల్లలో యూత్ డిక్లరేషన్ సభ నిర్వహిస్తామనీ, దీనికి రాహుల్‌గాంధీ హాజరుకానున్నారు.
ఆకలి, ఆరోగ్యం, పంటనష్టంపై కాంగ్రెస్ ఆందోళనలు : భట్టి
ఆకలి, ఆరోగ్యం, పంటనష్టంపై కాంగ్రెస్ ఆందోళనలు చేయాలని నిర్ణయించిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. వరదల వల్ల రైెతులు పెద్ద ఎత్తున నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి సరైన ఆహారం,పాలు, నీళ్లు అందించకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులకు సహాయమందించడంతో సర్కారు వైఫల్యం చెందిందన్నారు. బ్యాక్‌వాటర్‌తో గ్రామాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని చెప్పారు. పంట నష్టంపై ఇంత వరకు అంచనా కమిటీ వేయలేదని విమర్శించారు. ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలపై లోక్‌సభలో ప్రస్తావిస్తామన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రే ఇలా మాట్లాడడం సరికాదు: ఉత్తమ్
క్లౌడ్ బరస్ట్ వల్లే రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు సంభవించాయని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ కుట్రతో వరదలు వచ్చాయనడంలో అర్థం లేదన్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే ఇలా మాట్లాడడం సరికాదని హితవుపలికారు. ఇది చిన్న ప్రాంతాల్లో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజల దృష్టి మళ్లించాలని సీఎం కేసీఆర్ చూశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందనీ, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే క్లౌడ్ బరస్ట్ అంటూ వ్యాఖ్యలు చేశారన్నారు.