Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంపు ప్రాంతాల్లో గవర్నర్ విస్తృత పర్యటన
- బాధితులతో మాట్లాడిన తమిళి సై
నవతెలంగాణ-అశ్వాపురం
'మీ బాధలు నాకు తెలుసు.. అందుకే మీ ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చా'నని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. ఆదివారం ఆమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత హైదరాబాద్ నుంచి రైల్వే మార్గంలో మణుగూరు చేరుకుని నేరుగా గౌతమినగర్ కాలనీలోని శబరి అతిధి గృహానికి చేరుకున్నారు. అక్కడి నుంచి పాములపల్లిలోని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎస్కేటీ ఫంక్షన్ హాల్లోని పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరదబాధితుల ప్రాంతాల్లోని సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, అందుకే తాను పర్యటనకు వచ్చినట్టు తెలిపారు. అక్కడి నుంచి చింతిర్యాల కాలనీ గ్రామాన్ని ఆమె సందర్శించి ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. తర్వాత గౌతమి నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి హాజరయ్యారు. అక్కడ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కిట్లతోపాటు మందులను బాధితులకు అందజేశారు. అదేవిధంగా పునరావాస కేంద్రంలోని బాధితులకు భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎవరూ అధైర్య పడొద్దని, ప్రభుత్వం అన్ని విధాల తమకు సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఆమె వెంట జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఉన్నారు.