Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు
- రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు :
- ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
విద్య, ఉపాధి, హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర కార్యదర్శి ఏం.అడివయ్య అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సెప్టెంబర్ 8న జిల్లా కేంద్రంలో వికలాంగుల చట్టాలు సంక్షేమ పథకాలపై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 9-11తేదీల్లో రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు జరుగుతున్నాయన్నారు. వీటికి 33 జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ప్రభుత్వ పథకాలు వికలాంగులకు సక్రమంగా అందడం లేదన్నారు. రాష్ట్రంలో 20లక్షల మంది వికలాంగులు ఉన్నారని అన్నారు. వీరి సంక్షేమం పట్ల చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న అవేవీ వికలాంగులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 2014 నుంచి రాష్ట్రంలో 12 లక్షల ఆసరా పింఛన్లు రద్దు చేశారని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పింఛన్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం పెండింగ్లో ఉన్న ఆసరా పింఛన్లు ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగ వికలాంగులకు స్వయం ఉపాధి పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 40 శాతం వైకల్యం కలిగిన వికలాంగులకు అంత్యోదయ రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. ఇండ్లు లేని వికలాంగులకు డబుల్ బెడ్రూంలు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మివేయడం ద్వారా వికలాంగులకు రిజర్వేషన్స్ దక్కకుండాపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను మార్చాలని ప్రయత్నిస్తుందని అన్నారు. నేషనల్ పాలసీ ముసాయిదాపై దేశ వ్యాపితంగా విస్తృతంగా చర్చించాలని డిమాండ్ చేశారు. హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జే.దశరథ్, కార్యదర్శి అర్ శంకర్, కోశాధికారి సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.